Jul 26,2023 22:31

నీటిని చూసి భయపడుతున్న పాదచారుడు

ప్రజాశక్తి- ఆమదాలవలస: మండలంలోని కనుగులవలస వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్‌ టన్నల్‌లో నీరు చేరడంతో 10 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. 8 నెలల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకలేదు. పైగా పక్కనే రైల్వే గేటును మూసివేయడంతో ప్రయానికులు వెళ్లేందుకు వేరే దారి లేక అవస్థలు పడుతున్నారు. ఆమదాలవలస నుంచి తమ్మియ్యపేట, అటు నుంచి ఆమదాలవలస వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. బొడ్డేపల్లిపేట, కొర్లకోట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అండర్‌ టన్నల్‌ పనులు నత్తనడకన సాగడంపై రైల్వే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు పూర్తికాకుండా రైల్వే గేటును మూసివేయడం ఏమిటని రైల్వేశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ్మయ్యపేట, ముద్దాడపేట, కంచరాపువానిపేట, కలివరం, పీరుసాహెబ్‌పేట, దూసి తదితర గ్రామాల ప్రజలు నిత్యం ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల స్పీకర్‌ చొరవతో ముద్దాడపేట కూడలి నుంచి ఓవర్‌ బ్రిడ్జి వరకు నూతన రహదారిని నిర్మించారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే అధికారులు చొరవ చూపి రైల్వే అండర్‌ టన్నలు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు మాట్లాడుతూ అండర్‌ టన్నలు పనులు పూర్తికాకుండానే రైల్వే గేటు మూసివేయడం దారుణమని అన్నారు. పది గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారని, అండర్‌ టన్నల్‌ నీటితో నిండిపోవడంతో ఇక్కడ వరకు వచ్చి ప్రయాణికులు ప్రజలు మళ్లీ వెనుతిరిగి వెళ్తుండడం బాధాకరమన్నారు.