May 03,2023 23:13

అచ్చంపేటలో తడిసిన వరి పంటను పరిశీలిస్తున్న ఎఒ సత్య

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
వరుస భారీ వర్షాలతో రైతులు నిండా మునిగి పోయామని, తమను అకాల వర్షాలు ముంచేస్తున్నాయని దాళ్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 22 వేల ఏకరాల్లో వరిసాగు జరిగింది. దానిలో 9800 ఏకరాళ్లో వరి కోతలు పూర్తయ్యాయి. మరో 2 వేల ఏకారాల్లో ధాన్యం కళ్ళాలపై ఉండి తడిసి ముద్దయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటలకు కాస్త ఎండ కాసిందని బరకాలు తొలగించి ధాన్యం ఆరబెట్టు కుం దామనుకుంటే కనీసం ఒక్క గంట సైతం విరామం లేకుండా వరు సగా వర్షం తేలికపాటిగా కురుస్తూనే ఉంది. ఉదయం 10 గంటల నుండి వాన వరుసగా కురుస్తూనే ఉండడంతో ధాన్యం రాశులును ప్లాస్టిక్‌ బరకాలతో కప్పి సంరక్షించుకునే పనిలో రైతులు పడ్డారు. బుధవారం ఉదయం నాటికి సామర్ల కోటలో 8.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే దాళ్వా పంట తమకు చేతికి అందే అవకాశం లేదని పి.వేమవరం గ్రామానికి చెందిన రైతులు ఆచంట కొండ, రాసంశెట్టి దొరబాబులు చెప్పారు. తడిచిన, రంగుమారిన ధాన్యంను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
1200 ఎకరాల్లో పంట ప్రాథమిక నష్టం: ఎఒ సత్య
కాగా మండల పరిధిలో వర్షాల ప్రభావంతో సుమారు 1200 ఎకరాల వరి పంట నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేసినట్లు మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య చెప్పారు. బుధవారం అచ్చంపేట, గొంచాల గ్రామాల్లో పర్యటించి పంట నష్టంను పరిశీలించినట్లు చెప్పారు.