Mar 14,2023 21:31

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు - అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదనే కఠిన నిబంధనల నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల్లో జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 15 కేంద్రాలు, ఏలూరు జిల్లా పరిధిలో 39 కేంద్రాలు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 72,048 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 33,874 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 38,174 మంది ఉన్నారు. పరీక్షలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రారంభ సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. అభ్యర్థులు కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది.
కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు తెలియజేయడానికి ఏలూరులోని ఆర్‌ఐఒ కార్యాలయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు 08812-230197 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేయవచ్చు లేదా
కంట్రోలు రూమ్‌ ఇన్‌ఛార్జి జి.రత్నకిషోర్‌ 7032241842 నెంబరుకు ఫోన్‌ చేసైనా సమస్యలను తెలపవచ్చు.
ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు
పరీక్షలు పటిష్టంగా నిర్వహించడానికి ఆరు ఫ్లయింగ్‌, 12 సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు. వీటితోపాటు హైపవర్‌ కమిటీ (హెచ్‌పిసి), జిల్లా పరీక్షల కమిటీ (డిపిసి) సభ్యులు, డివిఇఒలు, రెవెన్యూ అధికారులు ఆయా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. మొత్తం 106 మంది ముఖ్య పర్యవేక్షకులు, 106 మంది విభాగాధికారులను నియమించారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. వీటిని పోలీసు బందోబస్తు మధ్య భద్రపర్చారు. మొత్తం 30 స్టోరేజీ పాయింట్లకు వీటిని తరలించారు. వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించే పనుల్లో అధికారులు నిమగమయ్యారు.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లోఉంటుంది. ఆయా కేంద్రాలకు సమీపంలోని ఫొటోస్టాట్‌ దుకాణాలు, ఇంటర్నెట్‌ సెంటర్లను మూసివేయాలి. అన్ని కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం కల్పించాం. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది కూడా ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు, మొబైల్‌ ఫోన్స్‌, ఐపాడ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకురాకూడదు.
-కె.చంద్రశేఖర్‌బాబు, ఆర్‌ఐఒ