ప్రజాశక్తి-డుంబ్రిగూడ:ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మండలంలోని కురిడి పంచాయతీ నిమ్మగడ్డ గ్రామానికి ఆ సమస్య తీరింది. ఎన్నారై దంపతులు వడ్లాని కాశయ్య, విజయ కుమారి దంపతుల రూ.4 లక్షల ఆర్థిక సహాయంతో శారద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో సురక్షిత తాగునీటి పథకాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన గ్రావిటీ పథకాన్ని ఆదివారం శారదా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి వి.తిరుపతిరావు, ఎన్నారై దంపతులు వడ్లాని కాశయ్య, విజయ కుమారి దంపతులు ప్రారంభించారు. ప్రారంభించడానికి వెళ్లిన ప్రతినిధులకు ఆ గ్రామస్తులు పూలదండలతో ఆహ్వానించారు. అనంతరం శారదా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వి.తిరుపతిరావు మాట్లాడుతూ, ఏజెన్సీ మారుమూల గిరిజన గ్రామాల్లో సురక్షిత తాగునీటి సౌకర్యం లేక కలుషితమైన నీటిని ఉపయోగిస్తూ అనేకమంది గిరిజనులు పలు రకాల వ్యాధుల బారినపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను కొన్ని గ్రామాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సురక్షిత తాగునీటి పథకాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్నారైల ఆర్థిక సహకారంతో ఇటువంటి పథకాలను నిర్మిస్తున్నామని, వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ గ్రావిటీ పథకం నిర్మాణానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ డిజిఎం మంత్రి శ్రీనివాసరావు, జగదీశ్వర్‌రావులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శారద ట్రస్ట్ ఇంజనీర్ సిహెచ్ సత్యనారాయణ, కోఆర్డినేటర్ వి.రత్నం, కురిడి పంచాయితీ సర్పంచ్ లచ్చు, ఎంపిటిసి మహాదేవ్, పార్టీ సభ్యుడు బాబురావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు, మండల కార్యదర్శి పి సత్యనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










