May 31,2023 19:26

హాజరైన కౌన్సిలర్లు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార దిశగా కృషి చేయాల్సిన కౌన్సిల్‌ ప్రాధాన్యత కోల్పోతోంది. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రజా సమస్యలపై నెలకోసారి చర్చించాలని రాజ్యాంగంలో పేర్కొన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిల్‌ సభ్యులు మాత్రం ప్రజా సమస్యల కంటే పెళ్లిళ్లు, ఫంక్షన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తూ కౌన్సిల్‌ సమావేశాన్ని 10 నిమిషాల్లోనే ముగించి వెళ్లిపోయారు. బుధవారం మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కోరం లేదని ఛైర్మన్‌, కౌన్సిలర్లు, వైస్‌ ఛైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఇతర అధికారులు అరగంట సేపు వేచి ఉన్నారు. కోరం మేరకు సభ్యులు రావడంతో సమావేశాన్ని ప్రారంభించి అజెండాలోని అంశాలపై చర్చ విషయం అటుంచితే కనీసం అజెండాపై కూడా పూర్తిగా అధికారులను చదవనివ్వకుండానే అన్ని 'పాస్‌.. పాస్‌...' అంటూ కౌన్సిల్‌ సమావేశాన్ని 10 నిమిషాల్లోనే ముగించి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు రికార్డు సృష్టించారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో తేలుకాటుకు గురై ఒక బాలుడు మృతి చెందినా దానిపై చర్చించకుండా పట్టణంలో ఎలాంటి సమస్యలూ లేవంటూనే కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించారు. తమకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉన్నాయంటూ ఛైర్మన్‌ శాంతతో పాటు ఇతర కౌన్సిల్‌ సభ్యులు, వైస్‌ ఛైర్మన్లు గౌస్‌, నరసింహులు సమావేశాన్ని ముగించారు. మున్సిపల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ రెడ్డి కౌన్సిల్‌ సమావేశంలో అజెండా చదువుతుండగానే అన్ని 'పాస్‌.. పాస్‌...' అంటూ సభ్యులు ఆమోదం తెలిపారు. తాను నాలుగు సార్లు కౌన్సిలర్‌గా గెలుపొందానని, ప్రతిసారీ సమావేశాల్లో చర్చ ఉంటుందని, తన జీవితంలో ఇంత త్వరగా ఇంత ప్రశాంతంగా ఎలాంటి చర్చ లేకుండా సమావేశం ముగించడం గర్వించదగ్గ విషయమని సీనియర్‌ కౌన్సిలర్‌ వైజి.బాలాజీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని, దానిపై కూడా చర్చించుకోవడంపై, దానిని ప్రస్తావించేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై కొంతమంది కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కౌన్సిల్‌ హాజరు కోసమే, జీతం కోసమే వచ్చినట్లు అయిందని మరి కొంతమంది కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఎలాగో కౌన్సిల్‌లో తమ సమస్యలు చర్చించలేదని, కనీసం సమావేశం తర్వాత అయినా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కౌన్సిలర్లు రాజేశ్వర్‌ రెడ్డి, మరికొందరు ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తన ఛాంబర్‌లోకి వచ్చి చర్చించాలని పేర్కొన్నట్లు కౌన్సిలర్లు సమాచారం ఇస్తూ ఛాంబర్‌కు బయల్దేరారు. గత కౌన్సిల్‌ సమావేశం వరకు అనేక సమస్యలపై గళం విప్పిన అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ సమావేశంలో ఒక్క సమస్యపై కూడా చర్చించలేదు. చివరకు ఎస్‌ఎస్‌ ట్యాంకులో తాగునీరు ఉన్నాయా అనే విషయంపై కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి దృష్టికి పత్రికా విలేకరులు తీసుకెళ్లారు. ఇంకా రెండు నెలలకు సరిపడే తాగునీరు బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిల్వ ఉన్నాయని, ఎలాంటి నీటి సమస్య ఉండదని ఆయన తెలిపారు. కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించిన వైస్‌ ఛైర్మన్‌ ఎంఎంజి.గౌస్‌, నరసింహులు, కౌన్సిలర్లు చలపతి, బాలాజీ, ఫయాజ్‌ అహ్మద్‌ తదితరులు కౌన్సిల్‌ హాలులోనే పిచ్చపాటిగా చర్చించుకున్నారు. ఇదే చర్చ ప్రజా సమస్యలపై అధికారుల సమక్షంలో జరిగి ఉంటే పట్టణ ప్రజలకు కొంతవరకైనా మేలు జరిగేదని పలువురు పేర్కొన్నారు. డిప్యూటీ ఇంజినీర్‌ వెంకట చలపతి రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్‌ అస్లాం బాష, అసిస్టెంట్‌ ఇంజినీర్లు కృపాకర్‌, రాజశేఖర్‌ రెడ్డి, కౌన్సిలర్లు శాంతి, పార్వతి, అశోక్‌, చిన్న, ఉస్మాన్‌, మీనుగా మహాలక్ష్మి, ఇందు, మహేశ్వరి, సురేష్‌, ఇంతియాజ్‌, వసీం, కో ఆప్షన్‌ సభ్యులు తిమ్మక్క ఉన్నారు.