కడప అర్బన్ జిల్లాలో వినోదం పేరుతో సినిమాకు వచ్చే ప్రేక్షకులను సినిమా థియేటర్ల యజమాన్యాలు నిలువు దోపిడి చేస్తున్నాయని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ జిల్లా లో సినిమా థియేటర్ల యాజమన్యాలు ప్రభుత్వ నిబందనలు పాటించడం లేదని తెలిపారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం చెబుతున్నా పట్టించుకోకుండా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. థియేటర్లలో తినుబండారాల పేరుతో అధిక రేట్లకు ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడే విధంగా ఎమన్నా కుటుంబంతో కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని ఏమి కొనలేని పరిస్థితి ఉందని అన్నారు. కొత్త సినిమా విడుదల అయితే అధిక రేట్లకు టికెట్ల అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. సామాన్యుడు కుటుంబంతో వినోదం కోసం సినిమాకు రావాలంటే అధిక రేట్లకు భయపడి రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించడంలో విఫలం చెందరాని విమర్శించారు. ఆకస్మిక దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సినిమా థియేటర్ల యజమాన్యల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు షాకీర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సగిలి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.










