
చల్లారిన సంసారాలూ, / మరణించిన జన సందోహం,/ అసహాయుల హాహాకారం/ చరిత్రలో మూలుగుతున్నవి
సామ్రాజ్యపు దండయాత్రలో/ సామాన్యుల సాహసమెట్టిది?/ ప్రభువెక్కిన పల్లకి కాదోరు, /అది మోసిన బోయీలెవ్వరు?
వరుస అత్యాచార హత్యాచార ఘటనలు చూసిన వారికి. మహాకవి శ్రీశ్రీ కవిత గుర్తుకు రాక మానదు.
ఈ ఘటనల పట్ల బాధ్యత వహించాల్సిన మహిళా హోం మంత్రి...అందునా తర తరాల నుంచి అణచివేతకి గురయిన దళిత వర్గం నుంచి వచ్చిన మహిళ...జాతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని, బాధలను రూపుమాపుతారని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నవేళ...కీలక బాధ్యతలు తీసుకున్న తానేటి వనిత ఆ పదవికి న్యాయం చేస్తున్నారా?
మంత్రిగారి అర్థం పర్థంలేని మాటలు ప్రభుత్వం పరువు పోయేలా వుండడం అటుంచి... యావత్తు మహిళా లోకాన్ని, పౌర సమాజాన్ని నివ్వెరపరిచేలా ఉన్నాయి.
హోం మంత్రిగా బాధ్యత తీసుకొన్న తరువాత జరిగిన వరుస అత్యాచార, హత్యాచార, అమానవీయ ఘటనలపై ఆమె స్పందనలో సమాజం పట్ల మహిళల విలువల పట్ల అవగాహనా రాహిత్యం కనిపిస్తోంది. మానసిక వైకల్యం ఉన్న యువతి మీద ముప్పై గంటల పాటు ముగ్గురు మృగాలు అత్యాచారం చేసిన ఘటన గురించి తెలుసుకొనే ప్రయత్నం చెయ్యని నిర్లక్ష్య ధోరణి పోలీస్ శాఖను సైతం నివ్వెరపరచింది. మరో మైనర్ బాలికపై జరిగిన అఘా యిత్యానికి సంబంధించి తల్లి పాత్ర సక్రమంగా ఉంటే నేరాలు, ఘోరాలు జరగవు అంటూ బాధ్యత లేకుండా మాట్లాడిన వైనం మహిళా లోకాన్ని అవమానించేలా ఉంది.
తాజాగా రేపల్లె అత్యాచార ఘటన గురించి మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'అత్యాచారానికి పాల్పడిన వారు దుర్మార్గులు కాదు గానీ.. ఏదో తాగిన మత్తులో అలా చేసేశారు పాపం..' అనడం చూస్తుంటే వారి పట్ల సానుభూతి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అత్యాచారానికి పాల్పడిన వారు అసలు అత్యాచారం చేయడానికి రాలేదని.. పైగా వాళ్లు తాగి ఉన్నారని.. డబ్బు కోసం ఆమె భర్తపై దాడి చేశారని, అడ్డుకోబోయినందు వల్ల ఆమెను నెట్టేసే క్రమంలో అత్యాచారానికి గురైందని అన్నారు. ఎంతటి నిర్లక్ష్యపు విశ్లేషణ! నాలుగు నెలల గర్భిణి మీద ముగ్గురు మగ మృగాల సామూహిక అత్యాచారాన్ని అంత తేలికగా తీసుకోవడం క్షమార్హం కాదు. ఆడదానిగా ఎందుకు పుట్టించావమ్మా... అడవిలో కొమ్మనైనా ఈ బాధ ఉండక పోనుకదా...అని ఎలుగెత్తి అరవాలన్నా అరవనివ్వని రాక్షసత్వం పట్ల ఒక మహిళా మంత్రి స్పందన అమానవీయం. ఒక హోం మంత్రి మాట్లాడినట్టుగా లేదు.. ఆ అత్యాచారానికి పాల్పడిన వారి లాయరు మాట్లాడినట్టుగా ఉంది.
వరుసగా జరుగుతున్న ఈ అమానవీయ ఘటనల పరంపరలో బాధిత మహిళల సామాజిక స్థితిగతులను నిశితంగా విశ్లేషిస్తే దాదాపు అందరూ వెనుకబడిన దళిత వర్గాలకు చెందిన మహిళలే. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. ఆ వర్గ జీవులు ఓట్లు వేస్తే వచ్చిన పదవిలో వుండి...తన జాతికి జరుగుతున్న అన్యాయానికి, అవమానానికి బాధ్యతతో వ్యవహరించవలసిన హోం మంత్రి...బలి అయిపోయిన వారి నైతికతను మరింతగా దెబ్బ తీసే ప్రకటనలు చేయడం సిగ్గుచేటు.
అత్యాచార బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాల్సిందిపోయి... బహిరంగంగా నష్టపరిహారం ఇవ్వడం మరింత బాధ్యతా రహితం.
మద్యం, మత్తు మందులు, గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ఉద్యోగాల్లేవు. పనుల్లేవు. ఉత్పాదకత లేదు. అభివృద్ధి శూన్యం. బూతు సాహిత్యం మాత్రం అందుబాటులో వుంది. యువత పెడదారి పట్టడానికి ప్రధానమైన కారణాలివి. అయినా ఇవేవీ అధికార ప్రతిపక్ష నేతలకు పట్టలేదు. ఒకరినొకరు సభ్యతను మరచి విమర్శించుకోడం తప్ప. ఛిద్రమైన బతుకులను సైతం రాజకీయ క్రీనీడకు బలిచేస్తున్నారు.
ప్రతిపక్ష నేతకు చీర పంపిస్తానంటారు మరో మహిళా మంత్రి రోజా. చీర అసమర్ధతకు చిహ్నం అని తెలియచెప్పిన మంత్రి....మన సంస్కృతి సాంప్రదాయాలను దశ దిశలా చెప్పాల్సిన పర్యాటక శాఖా మంత్రి మరి.
మీరు ముఖ్యమంత్రి గారి ప్రాపకం కోసం చూస్తున్నారు. ప్రజలు మీ సేవ కోసం చూస్తున్నారు. నాకు తెలిసి ఒక వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి నిర్లక్ష్యపు ప్రకటనలు, వ్యాఖ్యలను హర్షించరు. పసికూనలు మొదలు పండు ముదుసలి వరకు కారేరీ అత్యాచారానికి అనర్హులు. నవ్యాంధ్రను నిర్మించుకోవాల్సిన మనం అత్యాచారాంధ్రగా పేరు గడిస్తుండడం అత్యంత బాధాకరం. అవమానకరం.
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో/ రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో/ మరో మహాభారతం...ఆరవ వేదం/ మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం... అని ఏనాడో రాసిన వేటూరి కవిత ఇంకా సజీవంగానే ఉన్నది.
- డా || వసుంధర