May 14,2023 00:00

ఆందోళన చేస్తున్న తొలగించబడిన కార్మికులు

ప్రజాశక్తి-రాంబిల్లి
రాంబిల్లి మండలం, నేవీ నిర్మాణ పనుల్లో ఎల్‌ అండ్‌ టి పి2 సబ్‌ కాంట్రాక్టరుగా ఉన్న ఎన్‌కె ఇండిస్టీయల్‌ సర్వీసెస్‌లో విధుల నుండి నిలుపుదల చేసిన 28 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నేవీ మెయిన్‌ గేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడునాయుడు మాట్లాడుతూ ఎన్‌కె ఇండిస్టీయల్‌ సర్వీసెస్‌లో గత మూడేళ్లగా పనిచేస్తున్న 28 మంది ఆపరేటర్లు, మెకానిక్స్‌, డ్రైవర్లను ఉన్నఫలంగా విధుల తొలగించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ఎల్‌ అండ్‌ టి పి2 యాజమాన్యం వెంటనే చొరవ తీసుకొని తిరిగి విధుల్లోకి తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని, సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌, లేబర్‌ అధికారులు జోక్యం చేసుకుని 28 మంది కార్మికులుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కె ఇండిస్టీయల్‌ సర్వీసెస్‌లో మూడేళ్ల నుండి కార్మికుల చేత రోజుకు 12 గంటల చొప్పన, ఎటువంటి సెలవుల్లేకుండా నెలలో 30 రోజులూ డ్యూటీ చేయించుకున్నారని, అందుకు ఓటి అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించలేదని, బోనస్‌ ఇవ్వలేదని, కనీస వేతనాలు అమలు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకంగా విధులు నుండి నిలుపుదల చేశారని, ఆ కార్మికులంతా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకలు సిహెచ్‌.నూకన్న, బాధిత కార్మికులు పాల్గొన్నారు.