ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : నిలిచిపోయిన సమగ్ర తాగునీటి పథకం పనులను చేపట్టాలని సిపిఎం పట్టణ కమిటీ కోరుతున్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జె.రామ అప్పలనాయుడుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు కమిషనర్‌తో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పట్టణంలో పురపాలక పరిధిలో నిలిచిపోయిన సమగ్ర తాగునీటి పథకం పనులను చేపట్టాలని,దశాబ్ద కాలంగా పార్వతీపురం పట్టణ ప్రజలు తాగునీరు సమస్యతో ఇబ్బందులు పడుతూ అనేక రూపాల్లో ప్రజలు నిరసనలు తెలిపారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎఐఐబి సాయంతో రూ.63 కోట్ల 63 లక్షలతో సమగ్ర తాగునీరు సరఫరా పథకం పేరుతో నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు ఈ పనులకు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్న దొర, ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేసి పండా వీధి చివర నుండి, ఆడబడి వీధి వరకు పైపులైన్లు వేసి మధ్యలో పనులను నిలిపివేశారన్నారు. ఈ నిలిచిన పనులను ప్రారంభించి పార్వతీపురం ప్రజలు తాగునీరు సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమములో పట్టణ సిపిఎం పార్టీ కమిటీ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, సభ్యులు పాకల సన్యాసిరావు, సంచాన ఉమామహేశ్వరరావు, బంకురు సూరిబాబు,, తదితరులు పాల్గొన్నారు.










