Apr 16,2023 23:15

గుత్తులపుట్టులో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణం

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారాయి. ఇప్పటికే నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు సచివాలయాలతో మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడంతో సమస్య మరింత జఠిలమైంది. సచివాలయాల నిర్వహణకు నిధులు వెచ్చించాల్సి రావడం అదనపు భారంగా మారింది. ప్రభుత్వం మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. పంచాయతీ కేంద్రంలో సచివాలయాలకు పక్క భవనాలను నిర్మించి అందులో పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వం మెరుగైన సత్వర సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకొంది. నిధుల కొరత కారణంగా కొన్నిచోట్ల సచివాలయ భవన నిర్మాణాల పనులు ముందుకు సాగడం లేదు.
పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీలో నిధుల కొరత కారణంగా సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం అనుకున్న సమయానికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ప్రజలు వాపోతున్నారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీ పాత భవనంలోనే సచివాలయం కొనసాగుతోంది. సొంత భవనంలోకి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. బిల్లులు రాక సచివాలయ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.