ప్రజాశక్తి-భట్టిప్రోలు : అద్దేపల్లిలో గత మూడేళ్లుగా నిలిచిపోయిన ప్రధాన రహదారి నిర్మాణానికి ఇటీవల అడుగులు ముందుకు పడ్డాయి. సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఈ రహదారి పనులు చేపట్టారు. దీంతో అద్దేపల్లి దళితవాడ వాసులు సంబర పడ్డారు. ఈ సంబరం కొన్ని రోజులకే కనుమరుగయ్యింది. రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తి కాలేదు. అర్ధాంతరంగా 20 మీటర్ల మేర రోడ్డు పనులు నిలిచిపోయాయి.పనులు చేపట్టిన అధికార పార్టీ నాయకుడు వివక్షను ప్రదర్శిస్తూ దళితవాడలో కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా రహదారిని సర్వే చేయించారు. దీంతో మాజీ సర్పంచి నివాస గహం రోడ్డు ఆక్రమణలో ఉన్నట్లు సర్వేలో తేలింది. సర్వే ప్రకారం కాకుండా పాత రహదారిలోనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాజీ సర్పంచి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. దీంతో కొన్ని రోజుల పాటు రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నాగార్జున ఓ మతురాలి కుటుంబ సభ్యులను పరా మర్శించేందుకు గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో మాజీ సర్పంచి మరియమ్మ తాను రహదారి నిర్మాణం పనులు అడ్డుకున్నట్లుగా ఆరోపిస్తున్నారని, అలాంటిదేమి లేదని రహదారికి అవసరమైన మేర స్థలాన్ని సేకరించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరింది. అయినప్పటికీ గుతేదారుడు నిలిచిన రోడ్డును పూర్తిచేయ్యకుండా అవసరం లేని వెల్లటూరు ఛానల్ వంతెన సమీపంలో రోడ్డును నిర్మించాడు. అవసరం లేని చోట రోడ్డును నిర్మించి తమకు అన్యాయం చేశాడని దళిత కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దళితుల పట్ల వివక్షతో రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం జరగని ప్రాంతంలో రహదారి గుంతల మయంగా మారింది. గుంతల్లో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి విషయం గురించి పిఆర్ ఎఇ రామచంద్రరావును వివరణ కోరగా అద్దేపల్లి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఆ నిధులు వేరేచోట వినియోగించినట్లు తెలిపారు. మళ్లీ నిధులు మంజూరైతే అద్దేపల్లిలో నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.










