కరోనా నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే పరిస్థితి
ఏలూరు జిల్లాలో పది నెలల్లో చేసింది 20 ఆపరేషన్లే
పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి
ప్రయివేటు ఆసుపత్రులో ఆపరేషన్‌కు రూ.10 వేలకుపైగా వసూలు
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కుటుంబ నియత్రణ ఆపరేషన్లను ప్రభుత్వాసుపత్రుల్లో చేయకపోవడంతో సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనాకు ముందు వరకూ జిల్లా, ఏరియా, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పిహెచ్‌సిల్లోనూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. అంతేకాకుండా ప్రత్యేక శిబిరాలు పెట్టి మరీ కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసేవారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారికి నగదు, వస్తువుల రూపంలో బహుమతులు సైతం అందించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కడా ప్రభుత్వ పిహెచ్‌సిల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. ఏరియా ఆసుపత్రుల్లో చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలంటే ప్రయివేటు ఆసుపత్రుల్లో రూ.పది వేల నుంచి రూ.15 వేలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజానీకం ఆర్థిక భారాన్ని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పది నెలల్లో చేసింది 20 ఆపరేషన్లే
ఏలూరు జిల్లాలో 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 అర్భన్ హెల్త్ సెంటర్లు, జిలా ఆసుపత్రి, జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో ఏరియా ఆసుపత్రులు, కైకలూరు, దెందులూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పలు ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో నెలకు కనీసంగా లెక్కించినా 800 వరకూ ప్రసవాలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకూ దాదాపు 17,327 ప్రసవాలు జరిగాయి. దీనిలో 8,464 ప్రభుత్వ, 8,863 ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయి. గడిచిన పది నెలల్లో ఏలూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం 20 మాత్రమే అంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో 90 శాతానికిపైగా కుటుంబాలు ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేయడంతో సామాన్య ప్రజానీకం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరులో జిల్లా ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు ద్వారకాతిరుమల, కాగుపాడు, దొరమామిడి, గొల్లపల్లి పిహెచ్‌సిల్లో మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 60 పిహెచ్‌సిలు ఉంటే కేవలం నాలుగింటిలో మాత్రమే జరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. ఆపరేషన్లు చేస్తున్నట్లు చెబుతున్న ఆసుపత్రుల్లోనూ సీరియస్‌గా జరగడం లేదని జరిగిన ఆపరేషన్ల సంఖ్యను బట్టి అర్థమవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు. పిహెచ్‌సిలో పని చేసే వైద్యులకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కుటుంబ నియత్రణ ఆపరేషన్లు ప్రారంభం కానున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కాలయాపన చేయకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.










