Jun 20,2023 00:39

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ జిల్లావ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు (ఆర్‌సి), డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్మార్ట్‌ కార్డులు రెండేళ్లుగా జారీ చేయడం లేదు. కార్యాలయానికి వెళ్లి అడిగితే త్వరలో పోస్టు ద్వారా పంపుతామని చెబుతున్నారు. కానీ పంపడం లేదు. ఆర్‌సి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల తయారీకి అవసరమైన స్టేషనరీ లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. 2021 ఆగస్టు నుంచి ఆర్‌సిలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల సరఫరా నిలిచిపోయింది.
జిల్లావ్యాప్తంగా కొత్తగా వాహనం కొనుగోలు చేసినప్పుడు రవాణాశాఖ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఆర్‌సిలో వాహనం రిజిస్ట్రేషన్‌ నంబరు, యజమాని పేరు, వాహనం తయారీ, నమూనా, వాహనం ఛాసిస్‌ నంబరు, ఇంజన్‌ నంబర్‌, ట్యాక్స్‌ వివరాలు, వాహనం తరగతి, రంగు, బరువు, క్యూబిక్‌ కెపాసిటీ, ఉపయోగించే ఇంధనం, రిజిస్ట్రేషన్‌, ఆర్‌సి గడువు తేదీ ముద్రించి ఉంటాయి. పూర్వం కొత్త రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ బుక్‌ (పేపర్లు) రూపంలో ఉండేది. కాలక్రమేణా వాడకంలో ఆర్‌సి పేపర్లు నలిగి పోయేవి. దీన్ని దష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకువెళ్లడాన్ని సులభతరం చేస్తూ ఆర్‌టిఒ అధికారులు తాజాగా ఆర్‌సి స్మార్ట్‌ కార్డులు జారీ చేస్తున్నారు. క్రెడిట్‌ కార్డు మాదిరిగా ఆర్‌సి కార్డులో స్మార్ట్‌ చిప్‌ కలిగి ఉంటుంది. చిన్న స్మార్ట్‌ కార్డులోనే అన్ని వివరాలు పొందు పరిచి ఉంటాయి. సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు సంబంధిత షోరూమ్‌ డీలర్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఆర్‌సి స్మార్ట్‌ కార్డు జారీకి సర్వీసు ఛార్జీలు రూ.350, పోస్టల్‌ ఛార్జీలు రూ.30లు ముందుగానే వసూలు చేస్తారు. 2021 ఆగస్టు నుంచి వాహనాలు ఆర్సీ కార్డులు జారీ చేయడం లేదు. కాకినాడ జిల్లాలో 35 వేల మంది ఆర్‌సి కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. సర్వీసు ఛార్జీలు, పోస్టల్‌ ఛార్జీలు కలిపి ఒక్కొక్క వినియోగదారుడి నుంచి రూ.380 చొప్పున రూ.1,37,50,000 రవాణా శాఖ ఖాతాకి జమ అయ్యాయి. ఆర్‌సి స్మార్ట్‌ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసినప్పుడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డు తప్పనిసరిగా చూపించాలి. లేకపోతే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల పరిస్థితి కూడా అంతే..
కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుని ట్రాఫిక్‌ నిబంధనలు, డ్రైవింగ్‌ టెస్టులు పూర్తి చేసి లైసెన్స్‌ మంజూరు అయిన వారు జిల్లాలో 50 వేల మంది ఉన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫీజుతో పాటు స్మార్ట్‌ కార్డు కోసం సర్వీసు ఛార్జీలు రూ.250, పోస్టల్‌ ఛార్జీలు రూ.30లు చొప్పున రవాణాశాఖ ఖాతాకి చెల్లించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేసిన 15 రోజుల్లో స్మార్ట్‌ కార్డు పోస్టల్‌ ద్వారా ఇంటికి పంపించాలి. కానీ లైసెన్సులు పరిస్థితి కూడా అలాగే ఉందని పలు వాహనదారులు వాపోతున్నారు.