Jun 21,2023 00:38

కంపెనీ ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - మేడికొండూరు : మండలంలోని పేరేచర్ల నికో ఆయిల్‌ ఆగ్రో కంపెనీలో దశాబ్దాల కాలం నుండి పనిచేస్తున్న కార్మికులకు తమ సమస్యలపై కంపెనీ ఎదుట మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సరైన ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం క్యాంటీన్‌ సదుపాయాలు కల్పించాలని యజమాన్యానికి పలుమార్లు విన్నవించినా స్పందన లేదని మండిపడ్డారు. తెల్లవారు జామున 5.30 గంటల నుండి చేపట్టిన నిరసనలో నికో ఆయిల్‌ ఆగ్రో కంపెనీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవా ధ్యక్షులు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్య కక్ష్య చర్యలు సాధింపుగా ఉన్నాయన్నారు. కొద్దిమంది కార్మికులను తొలగించేందుకు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంక్రిమెంట్‌లు పెంచాలని, కనీస సౌకర్యాలైన మంచినీరు మరుగుదొడ్లు క్యాంటీన్‌ వంటి సౌకర్యాలను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై యాజమాన్యం స్పందించకుంటే 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌ఎం బాషా, ఎం.వెంకటేష్‌, కె.శ్రీనివాసరెడ్డి, రహంతుల్లా ఖాసిం, మీరాసాహెబ్‌, మహేష్‌, చలపతి, రాంబాబు, సాంబశివరావు, భూపతి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.