Apr 30,2023 00:18

సమావేశంలో టిడిపి ప్లకార్డులతో నిరసన

ప్రజాశక్తి-తెనాలి:ప్రతిపక్ష నిరసనలు, ఫ్లకార్డుల ప్రదర్శన, వాకౌట్లతో మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో చైర్‌ పర్సన్‌ సయ్యద్‌ ఖలేదా నశీం అద్యక్షతన శనివారం జరిగిని సాదారణ సమావేశంలో మొత్తం 17 అంశాలతో కూడిన అజెండా ఆమోదం పొందింది. ఎలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఒక పక్క టిడిపి కౌన్సిలర్లు గత కౌన్సిల్‌లో జరిగిన దాడికి నిరసనగా ఫ్లకార్డులు ప్రదర్శించినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అజెండా అంశాలో ఆమోదం పొందాయన్నారు. అలాగే గత కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన ఘర్షణ, పరస్పర ఆరోపణల నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఘటనపై కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేవలో మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.
నిజనిర్ధారణ కమిటీకి నిరసనగా టిడిపి వాకౌట్‌
కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు వస్తూనే టిడిపి కౌన్సిలర్లు మార్కెట్‌ వద్ద గల ఎన్టీఆర్‌, మహాత్మాగాంధి విగ్రహాలకు నివాళులర్పించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సభలో కూడా ప్రతిపక్ష కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. గత కౌన్సిల్‌లో జరిగిన ఘర్షణకు సంబందించి చైర్‌పర్సన్‌ నిజనిర్ధారణ కమిటీ వేయటాన్ని నిరసిస్తూ కౌన్సిల్‌ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రీమూర్తి సారధ్యంలో సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తి మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో చైర్‌పర్సన్‌ ఉండి, ప్రత్యక్షంగా దాడి ఘటన చూసి, నిజనిర్ధారణ కమిటీ వేయటం హేయమైన చర్యన్నారు. పైగా అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కూడా కమిటీలో స్థానం కల్పించామని చెప్పటం అత్యంత బాధాకరమన్నారు. దాడి ఘటనలు మీడియాలో రాష్ట్ర వ్యాప్తగా ప్రజలు చూశారని, కమిటీ వేయటం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. దాడి చేయటమే కాకుండా దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టి, ఇప్పుడు చైర్‌పర్సన్‌ దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్‌, అన్నం పిన్నారావు ఆరోపించారు. కౌన్సిల్‌లో ప్రజల పక్షాన ప్రశ్నిస్థామని, అవినీతిపై పోరాడుతూనే ఉంటామన్నారు.