సారథి ఓ ధనవంతుని కుమారుడు. అతడి స్నేహితులందరూ ధనవంతులే. తన తరగతిలో సురేష్ అనే పేద విద్యార్థి ఉండేవాడు. కానీ అతను చాలా గుణవంతుడు. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. గొడవలకు దూరంగా ఉండేవాడు.
సారథి స్వతహాగా మంచివాడే. కానీ అతని స్నేహితులే సారథిలో భేదభావాలు నాటారు. అందుకే పేదవాడైన సురేష్‌ను దగ్గరకు రానిచ్చేవాడు కాదు.
ఈ మధ్య కరోనా విజృంభించడంతో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సారథి తగిన జాగ్రత్తలు పాటించక కరోనా వ్యాధి బారినపడ్డాడు. సారథిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.
అంతవరకు సారథితో కలిసిమెలిసి తిరిగిన మిత్రులెవరూ 'ఎలా ఉంది?' అని కూడా పలకరించలేదు.
కానీ సారథిóకి కరోనా వచ్చిందని తెలిసి సురేష్ చాలా బాధపడ్డాడు. వెంటనే సారథి ఇంటి దగ్గరకు వెళ్లాడు. అయితే ఇంట్లోవాళ్లు సారథిని కలుసుకోవడానికి అనుమతినివ్వలేదు. చేసేదేమీ లేక వెనుదిరిగిన సురేష్‌కి కిటికీలో నుంచి చూస్తున్న సారథిó కనిపించాడు.
'నీకేమీ కాదు ధైర్యంగా ఉండు!' అంటూ సురేష్ సైగలతోనే సారథికి ధైర్యం చెప్పాడు.
ప్రతిరోజూ సురేష్ వాళ్ల నాన్న సెల్ నుంచి సారథికి ఫోను చేసేవాడు.
మనం బలహీనులమనే భావనే పెద్ద వ్యాధి అని.. ధైర్యంగా ఉంటూ మంచి ఆహారం తీసుకోవాలని.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని కరోనాను జయించాలి! అని ధైర్యం చెప్పేవాడు.
సారథికి అప్పుడర్థమైంది నిజమైన స్నేహితులెవరో. ధనం కన్నా గుణం మిన్న అని. మనం ఆపదలో ఉన్నప్పుడు మనకోసం నిలిచినవాడే నిజమైన స్నేహితుడని గ్రహించాడు.
తక్కువ కాలంలోనే సురేష్ అందించిన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో, రోగ నిరోధకశక్తిని పెంచుకుని సారథి కరోనాను జయించాడు.
తన స్నేహితుడు కోలుకున్నాడని తెలిసి పలకరిద్దామని బయలుదేరిన సురేష్‌కి దారిలో సారథి స్నేహితులు కనిపించారు.
'పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. వారికి ధైర్యం చెప్పాలి. కనీసం ఫోన్ ద్వారానైనా పలకరిస్తూ ఉంటే ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు!' అని హితవు పలికి, వారినీ సారథి ఇంటికి తీసుకెళ్లాడు.
- జి.భానువర్ధన్
8106586997