May 24,2023 19:15

ఆయకట్టు రైతులతో మాట్లాడుతున్న తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌ అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలో తుంగభద్ర జలాశయం కింద ఉన్న నిజమైన ఆయకట్టుదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌ జెఇ తిమ్మారెడ్డి ఆయకట్టు రైతులకు తెలిపారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిజమైన ఆయకట్టు రైతులు ప్రతేడాది సంబంధిత శాఖకు చలానా కట్టి రసీదు పొందితే వారి మనగడకు ఏ ఢోకా ఉండదని తెలిపారు. అక్రమంగా సాగునీటిని వాడుకొని నిజమైన ఆయకట్టు రైతులకు నష్టం చేకూర్చే వారి అక్రమ కనెక్షన్లను తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆయా గ్రామాల్లో అనాదిగా సాగునీటి కింద పంటలు పండించుకునే ఆయకట్టు రైతులకు ప్రతేడాది అక్రమ కనెక్షన్లు తీసుకున్న వారితో గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అలా జరగకుండా అక్రమ కనెక్షన్లు తొలగించేలా చర్యలు తీసుకుంటామని, అందుకు ఆయకట్ట రైతులందరూ సహకరించాలని కోరారు. రెవెన్యూ కార్యదర్శులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.