Aug 24,2022 22:42

మాట్లాడుతున్న వీరేన్‌

దేశంలో క్రీడలకు సౌకర్యాలు, ప్రోత్సాహం మెరుగైంది..
గీతం 'చేంజ్‌ మేకర్స్‌'లో భారత హకీ మాజీ కెప్టెన్‌ వీరేన్‌
ప్రజాశక్తి- విశాఖపట్నం    
నిజాయితీతో కృషి చేస్తే, క్రీడల్లో రాణించి, దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగవచ్చనిభారత హకీ జట్టు మాజీ కెప్టెన్‌ వీరేన్‌ రాస్‌క్విన్హ అన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం దేశంలో క్రీడా సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయని, క్రీడలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. బుధవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన 'ఛేంజ్‌ మేకర్స్‌' కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాలలో క్రీడలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విచారకరమన్నారు. అన్ని క్రీడలకు తగినంత మంది కోచ్‌లను నియమిస్తే, క్రీడారంగం మరింత బలోపేతమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవుతుందన్నారు. క్రీడల వల్ల సమానత్వం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బృందంగా కలిసి పనిచేయడం, నిజాయితీగా వ్యవహరించడం వంటి లక్షణాలు యువతలో పెంపొందుతాయన్నారు. తన కుటుంబంలో ఎవరూ క్రీడాకారులు లేనప్పటికీ, బాల్యంలో తాను చదివే పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు ఒలింపిక్‌ క్రీడాకారుడు కావడం వల్ల తాను హాకీ క్రీడల్లో రాణించడానికి, తద్వారా భారత జాతీయజట్టుకు కెప్టెన్‌ కావడానికి దోహదపడిందన్నారు. క్రీడాకారులంతా సమిష్టిగా తమ ప్రతిభను చాటితే, జట్టుగా విజయం తధ్యమన్నారు.విద్యార్థులు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పాటిస్తే చదువుతో పాటు క్రీడలల్లోనూ రాణించవచ్చన్నారు. విద్యార్ధులు ప్రతి రోజూ పావు గంట నుంచి అరగంట సేపు నడక అలవాటు చేసుకోవాలని, తగినంత వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం వస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి యువత క్రీడలలో సైతం సమానంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ముఖాముఖిలో వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.