ప్రజాశక్తి-అనంతపురం దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా నిజాయితీగా సంక్షేమ పథకాలను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం రాప్తాడు మండలం బండమీదపల్లిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్‌నెస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఎమ్మెల్యే సొంత నిధులు రూ.40లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా నిజాయితీగా పనులు చేశామన్నారు. అంతేగాకుండా సిఎం జగన్ రాష్ట్రంలోని ప్రజలు, మహిళలు, రైతులను సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారన్నారు. ప్రజల ప్రేమికుడైనా సిఎం జగన్ అడుగుజాడల్లో నడుస్తున్నామన్నారు. దాదాపు 40ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రుగా పని చేసిన పరిటాల కుటుంబం కనీసం బండమీదపల్లి ప్రధాన రహదారిని పట్టించుకోలేదన్నారు. అలాంటి రోడ్డును తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.