పాలకులే పని గట్టుకుని అబద్ధాలకు ఆఫీసులు తెరచి, ప్రచారాలు మొదలు పెడితే ఆ దేశం ఎలా ఉంటుంది? ఆ దేశ ప్రజలకు దిక్కెవరూ? నిజమే-మన దేశం ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. దిక్కెవరు అని దిక్కులు చూడడం కాదు. ప్రతి పౌరుడూ నిజాల్ని నిలబెట్టే సైనికుడై దిక్కులు పిక్కటిల్లేలా నిజాల్ని ప్రకటిస్తూనే ఉండాలి-తప్పదు. సామాన్య పౌరులు ఎంతో బాధ్యతతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోవాల్సిన తరుణమిది. అబద్ధాలు ప్రచారం కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన సమయం కూడా!
''వేడి వేడి కొబ్బరినీళ్ళు క్యాన్సర్‌ను తగ్గిస్తా''యన్న వాట్సప్ మెసేజ్ వైరల్ అయ్యింది. దాని మీద ముంబాయి లోని టాటా మెమోరియల్ సెంటర్ (టి.యం.సి) డైరెక్టర్ డా|| రాజేంద్ర బడ్వే పత్రికా ముఖంగా ఒకటికి రెండు సార్లు వివరణ ఇచ్చారు. క్యాన్సర్‌ను వేడి కొబ్బరి నీళ్ళు ఎంత మాత్రమూ తగ్గించవనీ, అలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరూ నమ్మకూడదని, ఎవరూ ఎవరికీ పంపకూడదనీ వివరణ ఇచ్చారు. ఇలాంటిదే మరో ఫేక్ మెసేజ్ సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో జోరుగా షికారు చేసింది. మహిళలు నలుపు రంగు బ్రాలు వేసుకుంటే క్యాన్సర్ తప్పక వస్తుందన్నది ఆ మెసేజ్ సారాంశం! దీని పట్ల కూడా టియంసి డైరెక్టర్ డా|| రాజేంద్ర ఇంగ్లీష్ దినపత్రిక 'ద హిందూ'తో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. ''సోషల్ మీడియా ఏమైనా ఆరోగ్య సమాచార కేంద్రమా? అక్కడ ఎవరైనా జబ్బుల్ని డయాగ్నైజ్ చేస్తారా? ట్రీట్‌మెంట్ ఇస్తారా? అదేదో మామూలు సమాచారం పంచుకున్నట్టు ఆరోగ్య సంబంధమైన విషయాన్ని ఎలా పంపుకుంటారూ? రోగుల్ని పరిశీలించి, పరీక్షించి నయం చేయడానికి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. ఆసుపత్రులు, అందులో తగిన వైద్య పరికరాలు ఉన్నాయి. జబ్బు చేస్తే ఎవరైనా వారిని సంప్రదించాలి. అంతేగానీ, ఇలాంటి గాలి కబుర్లను ఎలా నమ్ముతారూ? తప్పుడు సమాచారం ఇతరులకు ఎలా చేరవేస్తారూ? తప్పు కదా? జబ్బు ఒకటే అయినా, పేషెంట్ శరీర ధర్మరీత్యా పాథలాజికల్ టెస్ట్ రిపోర్టుల రీత్యా, రోగుల స్థితిగతులేమిటో అనుభవజ్ఞులైన డాక్టర్లు కదా నిర్ణయించాలి? సరైన వారిని సంప్రదించి, సరైన సమాచారం తెలుసుకోకుండా బాధ్యతారహితంగా ఎలా దుష్ప్రచారాలు చేస్తారు? - అని నెటిజనుల్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మహిళలు నలుపురంగు లోదుస్తులు ధరించడం వల్ల క్యాన్సర్ రాదు అని ఆయన వివరణ ఇచ్చారు.
''ప్రతి సంవత్సరం భారతదేశంలో పది లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొంత మంది రోగులు ఇటీవలి కాలంలో ఆవు మూత్రం తాగి క్యాన్సర్ తగ్గుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి, క్యాన్సర్ ముదిరిపోయిన దశలో చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. ఈ విషయాన్ని కలకత్తాలోని నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డా|| సౌరవ్ దత్తా ధవీకరించారు. అక్కడ ఈయన మెడ క్యాన్సర్ స్పెషలిస్ట్. అనారోగ్యకరమైన మూఢనమ్మకాల బారిన పడి ఎంతో మంది ప్రాణం మీదికి తెచుకుంటున్నారనీ, వెంటనే అలాంటివి మానెయ్యాలని ఆయన హితవు పలికారు. వైజ్ఞానిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, జనం మూర్ఖంగా అనామకులు, అజ్ఞానులు చెప్పింది నమ్మకూడదు.
భోపాల్ పార్లమెంట్ సభ్యురాలు బిజెపికి చెందిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్...తనకు రొమ్ము క్యాన్సర్ ఆవు మూత్రంతో నయమైందని ప్రకటించారు. దాన్ని మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. దానికి డా|| సౌరవ్ దత్తా కీలెరిగి వాత పెట్టారు. ఆమెకు నిజంగానే ఆవు మూత్రంతో క్యాన్సర్ నయమైపోతే మరి హాస్పిటల్లో మాసెక్టమీ చేయించుకోవడానికి ఎందుకు చేరారూ?'' అని ప్రశ్నించారు. శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించకుండా ఆపరేషన్ చేసి రొమ్ము భాగాన్ని తొలగించడాన్ని 'మాసెక్టమీ'-అంటారు. అమాయక జనాన్ని అయోమయంలో పడదోసే అబద్ధపు ప్రకటనలు ఎవరిచ్చినా నమ్మకూడదు. నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఉన్నత పదవుల్లో ఉన్న వారు చెప్పినంత మాత్రాన ఏదైనా నిజమైపోదు. విషయ పరిజ్ఞానం ఉన్నవారు చెప్తేనే సత్యం బయటికి వస్తుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక నాటు వైద్యుడు పాము, తేలు, ఇతర విష పురుగుల కాటుకు తన దగ్గర వైద్యం ఉందని చెప్పుకున్నాడు. బాధితుల్ని ఎండలో కూర్చోబెట్టి, వారి వీపుల మీద ఇత్తడి పళ్ళాలు పెడుతున్నాడు. దాని వల్ల విషం దిగిపోతుందని నమ్మిస్తున్నాడు. అంధ విశ్వాసాలు వీడని ప్రజలు నమ్ముతూ అతను చెప్పినట్లు వింటున్నారు. ఇలాంటివి దేశ వ్యాప్తంగా ఎన్నో ఎన్నెన్నో నిత్యం జరుగుతూనే వున్నాయి. మోసపూరితంగా జనాన్ని నమ్మించే మోసగాళ్లు అడుగడుగునా వున్న ఈ దేశంలో పౌరులు వివేకవంతులైతే తప్ప మార్పు రాదు. ఒక అబద్ధంతో ఆ నాటు వైద్యుడు పొట్ట పోసుకుంటున్నాడు. కానీ వందల మంది ప్రాణాలు ఫణంగా పెడుతున్నాడు. అదెంతో ప్రమాదం కదా?
19వ శతాబ్దంలో ఓ మహానుభావుడు ఓ కథ చెప్పాడు. ఒక రోజు నిజం, అబద్ధం రెండు కలిశాయి. అబద్ధం అంది కదా... ''చూడూ! ఈ రోజు ఎంత అందంగా ఉందో'' అని. నిజం పైకి చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ''అవును సుమా. ఈ రోజు ఎంతో హాయిగా ఉంది'' అంది. వారు అలా నడుస్తూ ఒక దిగుడు బావి దగ్గరికి వచ్చారు. ''చూడు! ఈ దిగుడు బావిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. పద హాయిగా స్నానం చేద్దాం!'' అంది అబద్ధం మనసులో ఏదో కుట్ర పెట్టుకుని. అది నిజం గ్రహించలేక స్నానానికి ఒప్పుకుంది. ఇద్దరూ బట్టలు గట్టు మీద విడిచి బావిలోకి దిగారు. సంతోషంగా జలకాలాడారు. ఉన్నట్టుండి అబద్ధం గబుక్కున బావిలోంచి బయటకి వచ్చింది. అంతకు ముందే నిజం విప్పేసిన బట్టలు తొడుక్కుని అక్కణ్ణించి జారుకుంది. జరిగిందేమిటో గ్రహించి, నిజం బావిలోంచి బయటకు వచ్చేసరికి... అక్కడ తన గుడ్డలు కనిపించలేదు. అబద్ధం విడిచిన బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడక, నిజం మళ్లీ బావి లోకి వెళ్లి దాక్కుంది. తనను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చి తన బట్టలు తనకు ఇప్పిస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంది.'
నిజం విడిచేసిన బట్టలు తొడుక్కుని, అబద్ధం మాత్రం దర్జాగా 'నిజంగా' చలామణి అవుతూ ఉంది. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, రాజకీయాలు, పరిపాలనా శాఖలు ఒక్కటేమిటి ప్రతి చోట, ప్రతి నోటా అది తన ప్రభావాన్ని చూపెట్టసాగింది. 'నిజం ఇది కాదు! అది వేరే వుందని'' ఆక్రోశించే నిజ నిర్ధారకులు, రచయితలు, వైజ్ఞానికులు, పౌర హక్కుల కార్యకర్తలు అన్యాయంగా శిక్షలకు గురవుతున్నారు. ఉరి తీయబడుతున్నారు. నిజం కోసం ఆక్రోశించే గొంతుల్ని పాలకుల తుపాకులు బలి తీసుకుంటున్నాయి. 'నిజం నగంగా నిర్భీతితో నిలబడడానికైనా వెనుకాడదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం విడిచేసిన బట్టలు మాత్రం తొడుక్కోదు' అని తెలిసిన సత్యాన్వేషకులు తమ జీవితాల్ని త్యాగం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిజాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తూనే ఉన్నారు...చేస్తూనే ఉన్నారు.
* డా|| దేవరాజు మహారాజు /వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త /










