నిజానికి నిలువుటద్దం 'ప్రజాశక్తి'
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
'నిజానికి నిలువుటద్దం 'ప్రజాశకి'్త అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక్కో పత్రికది ఒక్కో అజెండాగా సాగుతున్న నేపథ్యంలో 'ప్రజాశక్తి'ది మాత్రం ప్రజల పక్షమేనంటూ కొనియాడారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గురువారం ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. సభకు ప్రజాశక్తి జిల్లా మేనేజర్ సీఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ వాస్తవాలకు అద్దం పట్టేలా ప్రజాశక్తి కథనాలుంటాయని చెప్పారు. తన తండ్రి గెలుపుకోసం చదువుకు స్వస్తి పలికి పాదయాత్ర చేస్తూ చెమటోడ్చుతున్న క్రమంలో తనను తొట్టతొలిగా రాజకీయంగా వెలుగులోకి తెచ్చినదీ, మంచి గుర్తింపు వచ్చేలా చేసినది 'ప్రజాశక్తి' దినపత్రికేనంటూ కొనియాడారు. ప్రజాశక్తి దినపత్రిక వాస్తవాలను నిర్భయంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా రాస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మహిళలు తమ సొంత కాళ్లపై తాము నిలబడేలా ఉన్నత చదువులు చదవాలన్నారు. కుటుంబం మనకిస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగపర్చకుండా ఉన్నతంగా ఎదిగేందుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మహిళల్లో విద్యార్థి దశ నుంచే చైతన్యం వస్తే సొంతకాళ్లపై నిలబడగలికే శక్తిని కూడగట్టుకోగలరని అన్నారు. అనంతరం ప్రజాశక్తి వార్షికోత్సవ ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ప్రజాశక్తి బ్యూరో ఇన్‌ఛార్జి వళిగళం గోపి, డివిజన్ ఇన్‌ఛార్జి కిషోర్, సురేష్, పాత్రికేయులు కామేష్, ధనశేఖర్, వెంకటేష్, సీపీఎం నాయకులు పెనగడం గురవయ్య, కుమార్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.










