నా కళ్ళకు
సీతాకోకలను తగిలించి వెళ్ళావు
అవి నీకోసం
ఎక్కడెక్కడో ఎగురుతున్నాయి
అలసినా సొలసినా
ఆగనంటున్నాయి !
అలా దూరం నుండి కనబడే
నీ నవ్వుల నక్షత్రాలను
అందుకోవాలని ఆరాటం
మిణుగురుల్లా ఎగిరే
నా హృదయ స్పందనలు
ఎంత ఎగిరినా చేరుకోలేనని
తెలిసీ అల్లాడుతున్నాయి!
నీ శ్వాసను మోసుకొచ్చిన
చిరుగాలి సైతం
నా ఊపిరిని లాక్కొని
చిక్కకుండా జారిపోతోంది!
నీలో..
వలపు కెరటాలున్నాయో
మోహపు ఊటలున్నాయో!
నీలో..
పరవశించే ప్రకృతి ఉందో
సేద తీర్చే పచ్చదనముందో!
నీవొక..
ఎల్లలు దొరకని విశ్వానివి
అలలు దొరకని సంద్రానివి!
నీవొక..
వేదనను తుంచే ఆనందానివి
ఆదరణను పంచే అనంతానివి !
- పుట్టి గిరిధర్, 9491493170