ప్రజాశక్తి- యాదమరి: నీవా నదిలో గ్రానైట్ వ్యర్ధాలు రాళ్లు, నీరు వదిలేయడంతో నీవా నదిలోని నీరు పూర్తిగా కలుషితమైపోతోంది. మండల కేంద్రంలోని జోడిచింతల, మార్లబండ గ్రామాల పరిధిలోని ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ వారు వ్యర్ధాలను వారికి కేటాయించిన డంపింగ్ యార్డ్‌లో మాత్రమే తోలాల్సి ఉన్న వారు నిబంధనలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడే వ్యర్థాలను తోలేస్తున్నారు. వారి ఫ్యాక్టరీలో ఏర్పడిన వ్యర్ధపు రాళ్లు, జలాలను సైతం నీవానదిలోకి వదిలేస్తున్నారు. ఈ వ్యర్థపు నీరు ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీవా నది నిండా ప్రవహిస్తూ సాగు, తాగునీరును కలుషితం చేస్తున్నాయి. ఈ నీటిని నది పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు చేసుకుంటున్న రైతులు పొలాలకు చేరడంతో సారవంతమైన భూములు పంటలు పండించేందుకు వీలు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. పరివాహక ప్రాంతంలోని తాగునీటి బోరు బావులు నీరు సైతం కలుషితం అవుతున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు చిత్తూరు గుడియాత్తం రోడ్డు కిరువైపులా వ్యర్ధాలను తోలడంతో ఓవర్టేక్ చేసే సమయంలో వాహనాలు గ్రానైట్ రాళ్ల వల్ల ప్రమాదాల భారిన పడుతున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్లు నీవానదిని కలుషితం చేస్తున్నారని గ్రామంలోని ప్రజలు పంచాయతీ అధికారుల దష్టికి పలుమార్లు తీసుకెళ్లిన వారు తమకేమీ అన్నట్లు మిన్నుకుండుతున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గ్రామపంచాయతీ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు నీవానదిని కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీలపై చట్టప్రకారం చర్యలు తీసుకొని భూగర్భ జలాలను సంరక్షించాలని పలువురు రైతులు ప్రజలు కోరుతున్నారు.










