Apr 17,2023 01:27
నీటి శుద్ధి యంత్రం అందజేస్తున్న దాతలు

ప్రజాశక్తి-భట్టిప్రోలు(కొల్లూరు): కొల్లూరులోని శాఖ గ్రంథాలయంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయాధికారి మట్ట ఝాన్సీరాణి జ్ఞాపకార్థం ఆమె జయంతిని పురస్కరించుకుని సోదరుడు మట్టా దుర్గా ప్రసాద్‌ ఆదివారం తాగునీటి శుద్ధియంత్రంను బహూకరించారు. ఈ కార్యక్రమా నికి ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌ బత్తుల దేవానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కోసం రీడర్స్‌ ఆన్‌ డిమాండ్‌ నాట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసిన బుక్స్‌ను లైబ్రేరియన్‌ వెంటనే తెప్పించే ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రంథాలయంలో అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని జెడ్పిటిసి చొప్పర సుబ్బారావు, వైసిపి నాయకులు కమ్మేల సాంబశివరావును కోరారు. దీంతో స్పందించిన వారు నెల రోజుల లోగా మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం చైర్మన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సీనియర్‌ సహాయకులు ఎం సీతారామయ్య, లైబ్రేరియన్‌ వై రాంబాబు తదితరులు ఉన్నారు.