ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి జివిఎంసి సరఫరా చేసే నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తూర్పు నియోజకవర్గం టిడిపి నాయకులతో కలిసి ముడసర్లోవ రిజర్వాయర్ నీటిని శుద్ధి చేసే గ్యాలరీని, రిజర్వాయర్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న నీరు గత కొంతకాలంగా చాలా అధ్వానంగా వస్తుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న శుద్ధి చేసే గ్యాలరీ పూర్తిగా పాడైపోయిందని తెలిపారు. రిజర్వాయర్ నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కోట్లు వెచ్చించి రిజర్వాయర్ చుట్టూ రక్షణ గోడ నిర్మించాంచారే తప్ప, ప్రజలకు అవసరమయ్యే మంచినీటి సరఫరాపై శ్రద్ధ తీసుకోకపోడం అన్యాయమన్నారు. కూత వేటు దూరంలో నివాసం ఉండే నగర మేయర్ ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ రిజర్వాయర్ నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి సరఫరా చేయాలని, లేకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఒమ్మి సన్యాసిరావు, మద్దిల రామలక్ష్మి, రాజశేఖర్, బుడుమూరు గోవిందు, పోతన్నరెడ్డి ఒమ్మి అప్పలరాజు, గాడి సత్యం, ముగడ రాజారావు, మజ్జి రమణి తదితరులు పాల్గొన్నారు.










