ప్రజాశక్తి - సాలూరురూరల్ : మండలంలోని కూర్మరాజు పేటకు చెందిన యువకుడు క్వారీ కుంటలో పడి మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కూర్మరాజుపేటకు చెందిన బైరెడ్డి జ్ఞాన ప్రకాష్ శుక్రవారం తన పశువులను మేతకు గ్రామానికి పక్కన ఉన్న పామాయిల్ తోట ఎదురుగా గల పాత క్వారీ వద్ద తీసుకెళ్లాడు. ప్రకాష్ సాయంత్రం వరకు ఇంటికి చేరకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించినా కనిపించకపోవడంతో మళ్లీ శనివారం ఉదయం వెతకగ్గా అదే క్వారీ వద్ద గల కుంటలో శవమై పడి ఉన్నాడు. ఇది తెలుసుకున్న గ్రామపెద్దలు, బంధువులు స్థానిక రూరల్ పోలీసులకు సమారం ఇచ్చారు. ప్రకాష్ ఒంటి మీద చిన్న చిన్న గాట్లు ఉండడంతో ఇది ఎవరో హత్య చేసినట్లు వుందని దీనికి పోలీస్ వారు డాగ్ స్క్వాడ్ బృందాలను తెచ్చి వాస్తవాలు వెలికి తీయాలని, అంత వరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడ నుండి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. మృతుని బంధువులు కోరినట్లు విచారణ చేస్తామని, పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వాసుపత్రికి రావచ్చని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సాలూరు రూరల్ ఎస్ ఐ ప్రయోగ మూర్తి తెలిపారు.










