ప్రజాశక్తి - ఏలూరు
వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్టమైన నివారణా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సమీపించడంతో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనివిపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు పటష్టమైన చర్యలు చేపట్టాలని, దానికి సంబంధించిన కార్యాచరణ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక, పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి చెరువులను ముందస్తుగా ఈ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో నింపాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఆవాసాల్లో బోర్‌వెల్స్, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల పరిస్ధితి, లీకేజీలపై పరిశీలించి ట్యాంకుల మరమ్మతులు, క్లీనింగ్ పనులు చేయించాలన్నారు. గ్రామాల్లో మూగజీవాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సంబంధిత టబ్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. శునకాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు గుర్తించి అక్కడ నీటితో టబ్‌లను ఏర్పాటు చేయాలని డిపిఒను ఆదేశించారు. ప్రభుత్వపరంగా జిల్లాలో 87 ఆర్‌ఒ ప్లాంట్లు ఉన్నాయని, వాటిలో 21 ప్లాంట్లు మూతబడ్డాయని, వీటిని పునరుద్దరించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. జిల్లాలో 4,346 చేతిపంపులు ఉండగా వీటిలో 308 పంపులు పని చేయడం లేదని, 156 పంపులు రిపేరులో ఉన్నాయని, వీటి మరమ్మతులకు ప్రతిపాదనలు కూడా పంపాలని ఆదేశించారు. జిల్లాలో 269 మంచినీటి చెరువులు ఉన్నాయని, వీటిలో గోదావరి, కృష్ణా కాలువల ద్వారా 228 ట్యాంకులకు 90 నుంచి 70 శాతం వరకు నీటిని నింపడం జరుగుతుందని, 25 ట్యాంకుల్లో 75 నుంచి 50 శాతం, మరో 10 చెరువుల్లో 50 నుంచి 25 శాతం, ఒక చెరువులో 25 శాతం నీరు నింపడం జరుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు తెలిపారు. జల వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్, డిపిఒల సమన్వయంతో యాక్షన్‌ప్లాన్ తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వాటర్ ట్యాక్స్‌ను విఆర్‌ఒలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లతో కలిసి నూరు శాతం వసూలు చేయించాలన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ మార్చి 31వ తేదీకల్లా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాసరావు, డిపిఒ మల్లికార్జునరావు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, వ్యవసాయశాఖ జెడి రామకృష్ణ, ఎపిఇపి డిసిఎల్ ఎస్‌ఇ సాల్మన్‌రాజు, డ్వామా పీడీ రాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇలు, డిఇలు పాల్గొన్నారు.










