Oct 20,2023 20:14

వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం :   జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, జలాశయాల్లో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోనేలా రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు అధికారులకు సూచించారు. పరిస్థితులను ఏ రోజు కారోజు అంచనా వేస్తూ రైతుకు తగు సూచనలను అందించాలని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వెంకటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై ఆరా తీసారు. తోటపల్లి నుండి ఈ ఏడాది 55 వేల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం కాగా ఇప్పటికే 45 ఎకరాల వరకు అందించామన్నారు. శివారు భూములకు నీరు సరఫరా కావడం లేదని, అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొంత ఆశావహ పరిస్థితి నెలకొందని ఇఇ రామచంద్ర రావు వివరించారు. తాటిపూడి, ఆండ్ర, మడ్డువలస, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్‌ లలో ప్రస్తుతం నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, జలవనరుల శాఖ ఇంజినీర్లు తెలిపారు. జెడ్‌పి చైర్మన్‌ మాట్లాడుతూ నీటి సమస్య ను ఎలా అధిగమించగలమని సైంటిస్ట్‌ లను అడిగారు. నీటి సమస్య ఉన్న చోట్ల పొటాషియం నైట్రేట్‌ స్ప్రే చేస్తే వారం రోజుల పాటు పంట లైవ్‌ గా ఉంటుందని తెలిపారు. పంట కోతకు వచ్చే వరకు వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయాలని, ఖచ్చితమైన ఎన్యుమరేషన్‌ జరపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. లక్కిడాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థకు గత ఏడాది కొనుగోలుకు సంబంధించి హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిఎస్‌ఒకు సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా 26 మండలాల్లో ఆయిల్‌ పామ్‌ పంటకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, 570 ఎకరాల్లో పంట వేయడానికి గుర్తించారని, ప్రభుత్వం నుండి 100 శాతం సబ్సిడీ రైతుకు లభిస్తుందని, అంతే కాకుండా ఇంటర్‌ క్రాప్‌ కు కూడా సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్‌ తెలిపారు.
అనంతరం ఏరువాక కేంద్రం ద్వారా ముద్రించిన ప్రస్తుతమున్న వర్షాభావ పరిస్థితుల్లో వరి, ఇతర పంటల్లో యాజమాన్య చర్యలు అనే కర పత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో డిసిఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామా రావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ మీనా కుమారి , వ్యవసాయ సంబంధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.