Mar 09,2023 22:12

యథేచ్ఛగా వాటర్‌ప్లాంట్ల దోపిడీ
నిబంధనలు పూర్తిగా గాలికి
కలుషిత నీరే దర్జాగా విక్రయాలు
పట్టించుకోని అధికార యంత్రాంగం
రెండు జిల్లాల్లోనూ నెలకు రూ.30 కోట్లకుపైనే వ్యాపారం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జిల్లాలో తాగునీటి వ్యాపారం రోజురోజుకీ పెరిగిపోతోంది. వేసవి ప్రారంభం కానుండటంతో తాగునీటి పేరిట అడ్డూఅదుపు లేకుండా దోపిడీకి తెరలేచింది. వాటర్‌ప్లాంట్లలో నిబంధనల అమలులో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమవ్వడంతో ప్రజలు తమ ఆరోగ్యం ఫణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తక్కువగా లెక్కించినా దాదాపు 500కుపైగా తాగునీటి ప్లాంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 39 లక్షలు జనాభా ఉండగా పది లక్షల వరకూ కుటుంబాలు ఉన్నాయి. ఆక్వా చెరువుల కారణంగా తాగునీటి వనరులన్నీ పూర్తిగా కలుషితమైపోయాయి. ముఖ్యంగా డెల్టాలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జనం పూర్తిగా వాటర్‌ప్లాంట్ల నీటిపైనే ఆధారపడుతున్నారు. దీంతో వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. వాటర్‌ప్లాంట్లలో 20 లీటర్ల తాగునీటిని కొన్నిచోట్ల రూ.పదికి, మరికొన్నిచోట్ల రూ.20, ఇంకొన్ని ప్లాంట్లలో రూ.30కూ విక్రయిస్తున్నారు. జిల్లాలో ఆరు లక్షల కుటుంబాలుకుపైగా జనాభా వాటర్‌ప్లాంట్లలో నీటినే వినియోగిస్తున్నట్లు అంచనా. ఆ ప్రకారం లెక్కిస్తే సరాసరిన ఒక్కో కుటుంబం రోజుకు రూ.20 చొప్పున తాగునీటికి కేటాయించినా నెలకు రూ.36 కోట్ల వరకూ జనం తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్దమొత్తంలో జనం వాటర్‌ప్లాంట్లలో నీటిని వినియోగిస్తున్నప్పటికీ వాటిపై అధికారుల పర్యవేక్షణ అనేది తూతూమంత్రంగా నెలకొంది. నిబంధనల ప్రకారం వాటర్‌ప్లాంట్లలో ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాల్సి ఉంది. అయితే ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ఐఎస్‌ఐ నిబంధనల ప్రకారం వాటర్‌ప్లాంట్‌ నిర్మించాలంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న వాటర్‌ప్లాంట్లలో అత్యధికం రూ.మూడు లక్షలు పైబడి పెట్టుబడితో ఏర్పాటు చేసి నడిపించేస్తున్నారు. ఐఎస్‌ఐ నిబంధనలు పాటిస్తూ నడుస్తున్న వాటర్‌ప్లాంట్లు జిల్లాలో వేళ్లపైనా లెక్కించొచ్చు. వాటర్‌ప్లాంట్లలో నీరు తాగితే కాళ్లు నొప్పులు వంటివి పెరిగిపోతున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచిగాని, అధికారుల నుంచి సరైన స్పందన లేకుండాపోయింది. ఏదైనా ఫిర్యాదు అందితే తప్ప కనీసం వాటర్‌ప్లాంట్లలో తనిఖీలు అనేవి సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా రాజకీయ నాయకులు రంగంలోకి దిగి సమస్య బయటికి రాకుండా నొక్కేస్తున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతోంది.
నాణ్యతా ప్రమాణాలేవీ..!
వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు చేయాలంటే పరిశ్రమల శాఖతోపాటు పలు శాఖల అనుమతులు తీసుకోవాలి. నీటిని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పరీక్షలు చేసి అనుమతి ఇవ్వాలి. వాటర్‌ప్లాంట్ల ఏర్పాటులో నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అనుమతులు లేకుండా బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. ఆర్వో ప్లాంట్లలో తాగునీటి నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి నెలకొంది. తాగునీటి ప్లాంట్లలో ముందుగా నీటిని క్లోరినేషన్‌ చేయాలి. తర్వాత ప్రత్యేకమైన శాండ్‌ఫిల్టర్‌ ద్వారా వడపోయాలి. ఆపై కార్బన్‌ ఫిల్టర్స్‌, మైక్రాన్‌ ఫిల్టర్స్‌ శుభ్రం చేసి కంపార్టుమెంట్‌లోకి పంపాలి. ఆఖరి దశలో ఆక్సిజన్‌ను పంపి ఆక్సీకరణ చేయాలి. ఈ దశలో మినరల్స్‌ను జత చేయాలి. ఎక్కడా ఈ విధమైన నీటి శుద్ధత జరగడం లేదు. వాటర్‌ప్లాంట్‌లో నీరు సురక్షితం కాదని వైద్యులు సైతం సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం లీటర్‌ తాగునీటిలో 150 నుంచి ఉంచి 600 వరకూ మినరల్స్‌ ఉండాలి. వాటర్‌ప్లాంట్లలో నీటిలో 30 నుంచి 40 వరకూ మాత్రమే మినరల్స్‌ ఉంటాయని తెలుస్తోంది. వాటర్‌ప్లాంట్లలో నీరు తాగితే దీర్ఘకాలంలో తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు జనం వాపోతున్నారు. పంట కాలువల్లో నీరు ఆక్వా సాగుతో కలుషితం కావడంతో జనాలకు వాటర్‌ప్లాంట్లలో నీరే దిక్కుగా మారింది. ఇంతపెద్దమొత్తంలో నీటి విక్రయాలు సాగిస్తున్న వాటర్‌ప్లాంట్లపై నిరంతరం తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తాగునీటి వాటర్‌ప్లాంట్లపై దృష్టి సారిస్తే జనాలకు మేలు జరిగే అవకాశం ఉంది.