May 26,2023 19:20

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని మాధవరం గ్రామంలో నీటి సమస్య వల్ల ప్రజలు వలసలు వెళ్తున్నారని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం, ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తాగునీటి సమస్యను పరిస్కరించాలని తహశీల్దార్‌ చంద్రశేఖర్‌కు, ఎంపిడిఒ ప్రభావతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జయరాజు, సిపిఐ నియోజకవర్గ నాయకులు భాస్కర్‌ యాదవ్‌ మాట్లాడారు. మాధవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ప్రధానంగా ఉందని తెలిపారు. నేటికీ వారి గోడు వినిపించడం లేదన్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యమని, విసుగు చెంది కాలనీవాసులు నిరాశ చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య కారణంగానే స్థానికులు వలుసలు వెళ్తున్నారని తెలిపారు. పంచాయతీలో నిధుల కొరత లేనప్పటికీ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. సిపిఐ మానవ హక్కుల సంఘం చిదానంద, నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ నాయకులు దేవ పుత్ర, కెవిపిఎస్‌ నాయకులు అనిల్‌, మాధవరం గ్రామస్తులు సురేష్‌, మారెప్ప, హనుమంతు, రాజు, అశోక్‌ పాల్గొన్నారు.