Oct 06,2023 21:10

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర

 కడప అర్బన్‌ :కృష్ణ నీటి వివాదాలపై ఏర్పాటైన ట్రిబ్యునల్స్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని పునః పంపిణీ పేరుతో ఏపీ తెలంగాణ, రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బాధ్యతలను బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబనల్‌కు కట్టబెట్టి తద్వారా తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి కుట్రలను, అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా స్పందించని వైసిపి చేతకానితనాన్ని ఎండగడతామని వక్తలు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, టిడిపి రాష్ట్ర నాయకులు బి. హరి ప్రసాద్‌, డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ డబ్ల్యూ రాము, సిపిఐ ఎంఎల్‌ రమణయ్య, ఆమ్‌ ఆద్మీ పార్టీ డాక్టర్‌ శ్రీనివాసులు, లోక్సత్తా కష్ణ, రైతు సంఘం యం. వి సుబ్బారెడ్డి, దస్తగిరి రెడ్డి, శివారెడ్డి మహిళా సమాఖ్య బసిరున్నిస, వ్యవసాయ కార్మిక సంఘం సి సుబ్రహ్మణ్యం, అన్వేష్‌, మల్లికార్జున, ఏఐటీయూసీ జి వేణుగోపాల్‌, కేసి బాదుల్లా, సిపిఐ నగర కార్యదర్శి ఎన్‌. వెంకట శివ, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, డి హెచ్‌ పి ఎస్‌ మునయ్య, ఏఐవైఎఫ్‌ దస్తగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్‌ రాష్ట్ర నది వివాదాల చట్టం 1956 ప్రకారం కష్ణానది నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్‌ ట్రిబ్యునల్‌ 75శాతం నీటి లభ్యత ఆధారంగా మొత్తం కష్ణ నీటిలో 2130 టిఎంసిలుగా లెక్క గట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811, మహారాష్ట్రకు 525 , కర్ణాటకకు 734 టిఎంసిలు కేటాయిస్తూ మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తూ తీర్పు చెప్పిందన్నారు. మళ్లీ మూడు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇదివరకే బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను యధావిధిగా అమలు చేస్తూనే మిగులు జలాలను కూడా 448 టిఎంసిలుగా లెక్కగట్టి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పర్యావసానం మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందన్నారు. ఒకవైపు కేసు విచారణలో ఉండగానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దష్టిలో పెట్టుకొని అడ్డగోలు నిర్ణయాలు చేసి అందలమెక్కాలని చూస్తుందని విమర్శించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కష్ణ నీటి వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ మళ్లీ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిపునల్‌కు కట్టబెడుతూ చేసిన తీర్మానం ఆంధ్రప్రదేశ్‌కు అందులో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు 811 టిఎంసిలు కేటాయించగా అందులో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ కు 512, తెలంగాణకు 299 టిఎంసిలు కేటాయించారనాక్నరు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేటాయించిన మొత్తం 811టిఎంసిలను పునఃపంపిణీ చేసి నీటిలో సగం వాటా తనకు కావాలంటూ వితండ వాదం చేస్తోంది అన్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బచావత్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు ప్రకారం తాము ముందుగానే వినియోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టుల ఎత్తు, నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వాదిస్తున్నాయి అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ, జాతీయ హోదా కలిగిన పోలవరానికి నిధుల కేటాయింపు వంటి విషయాల్లో అన్యాయం చేస్తోందని మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కల్లప్పగించి చోద్యం చూస్తున్నారు అన్నారు. అనుమతి లేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన పల్లెత్తు మాట మాట్లాడడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎన్జీటీ కి ఫిర్యాదు చేసి పనులు ఆపించినా జగన్‌ లో మార్పు రాకపోవడం విచారకరమని వాపోయారు. రాయలసీమ ప్రయోజనాలను బిజెపికి తాకట్టు పెడుతున్న రాయలసీమ ద్రోహి జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకోసం ఈనెల 8న జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 9న కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తీర్మానం చేశారు. సమావేశంలో భాగ్యలక్ష్మి, మైనుద్దీన్‌, శంకర్‌ రెడ్డి, కట్టా యానాదయ్య, బాల చంద్రయ్య, చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.