సిపిఎం ప్లోర్‌లీడర్ బోయి సత్యబాబు
ప్రజాశక్తి-విజయవాడ
నీటి మీటర్లను రద్దు చేసి, పేద ప్రజలకు ఉచితంగా మంచినీటిన సరఫరా చేయాలని సిపిఎం ప్లోర్‌లీడర్ బోయి సత్యబాబు వైసిపి పాలకవర్గాన్ని డిమాండ్ చేశారు. నీటి మీటర్లు బిగిస్తున్న స్థానిక మధురానగర్ పసుపుతోటలో పలు నీటిమీటర్లను ఆపార్టీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తితో కలిసి శనివారం స్థానిక ప్రజల నుంచి సమాచారం అడిగి పరిశీలించారు. భారమైన నీటి మీటర్లను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్థానిక ప్రజలు సిపిఎం నేతల వద్ద స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ...ప్రజలకు భారంగా తయారయిన నీటి మీటర్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేసుకోవాలని లేనట్లయితే స్థానిక ప్రజలను కలుపుకొని ఉద్యమించాల్సి వస్తోందని హెచ్చరించారు. నీటి మీటర్ల వ్యవస్థను రద్దు కోరుతూ ఈ నెల 31న జరుగుతున్న కౌన్సిల్ సమావేశం అజెండాలోకి సిపిఎం తరుపున ఒక ప్రతిపాదనను పంపించడం జరిగిందన్నారు.అయితేఈ అంశంపై సమగ్రంగా చర్చించి, నష్టదాయకమైన, ప్రజలకు భారమైన నీటి మీటర్లపై తాము పెట్టిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఈ వ్యవస్థను రద్దు చేయాలనే దిశగా కౌన్సిల్ తీర్మానించి, ప్రభుత్వానికి పంపించి ప్రజల పక్షాన నిలబడుతుందో...లేదా భారాలు బిజెపి పక్షాన నిలుస్తుందో అధికార వైసిపి స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఏడాదికి ఏడు శాతం చొప్పున పెంచిన కారణంగా ఇప్పటికే 70 శాతం నీటి పన్ను చార్జీల మోత నగర ప్రజలు భరించక తప్పడం లేదని పేర్కొన్నారు. నీటి మీటర్లను ప్రవేశింప చేస్తే చార్జీలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, సామాన్య, పేద ప్రజలకు మంచినీటిని దూరం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు.కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో నీటి మీటర్ల వ్యవస్థను తీసుకొచ్చి, ఒక ప్రయివేటు ఏజెన్సీకి నీటి సరఫరా దాని నిర్వహణను ఒక ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించాలని అధికార వైసిపి నిర్ణయించిందన్నారు. ఇప్పటికయినా నీటి మీటర్ల వ్యవస్థను రద్దు చేయకుంటే, దానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగుతుందని హెచ్చరించారు.










