- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు
ప్రజాశక్తి-విజయవాడ: అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు వివిధ రూపాల్లో ప్రజలపై భారాలు మోపుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు విమర్శించారు. మధురానగర్ ఇందిరా కాలనీలో సిపిఎం నాయకులు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో సరైన రహదారి లేక గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తుందని ప్రజలు తెలిపారు. వేల సంఖ్యలో ఖాతాదారులు, వందల సంఖ్యలో పొదుపు గ్రూపులు ఉన్న ఆంధ్రా బ్యాంక్ మధురానగర్ బ్రాంచ్ మూసివేయటానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ విజయవాడలో నీటి మీటర్లు బిగించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఏళ్ల తరబడి ఆగిపోయిన అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పసుపు తోటలో నీటి మీటర్లు పెట్టడంతో అద్దెకు ఉన్న వారి మీద ఈ భారం పడే ప్రమాదం ఉండటంతో అద్దెకు ఉన్నవారు తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నీటి మీటర్ల ఏర్పాటును నిలిపివేయ్కపోతే ప్రజలను కలుపుకొని ఐక్య ఉద్యమాన్ని నడపడంతో పాటు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.కష్ణమూర్తి, కష్ణ, చిన్నా, ఎం.బాబురావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.










