Jan 11,2023 22:26

ప్రజాశక్తి-విజయవాడ: నీటి మీటర్లకు వ్యతిరేకంగా నగర వాసులు ఉద్యమించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. మధురానగర్‌ ఇందిరాకాలనీ రామాలయం వీధిలో నీటి మీటర్లకు వ్యతిరేకంగా బుధవారం పాదయాత్ర నిర్వహించారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు, ఇతర పలు రూపాల్లో నగరపాలక సంస్థ భారాలు మోపుతుందని స్థానికులు తెలిపారు. ధరలు పెరిగిపోయి, రాబడి తగ్గిపోతూ కుటుంబాలు గడవటమే కష్టంగా ఉన్న తరుణంలో నీటి మీటర్ల వల్ల నీటికి కొనుక్కొని తాగాల్సి వస్తుందని తాము ఎన్నడూ ఊహించలేదని వాపోయారు. మధురానగర్‌ ఏరియాలోని అండర్‌ గ్రౌండ్‌ రైల్వే బ్రిడ్జీ పనులు పూర్తి కాకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ నీటి వ్యాపారం చేయడానికి నీటి మీటర్లను నగరపాలక సంస్థ మధురానగర్‌లో ఏర్పాటు చేస్తుందని, భవిష్యత్‌లో మంచినీరు కూడా భారం అయ్యే పరిస్థితి ఉందని, తక్షణం నీటి మీటర్లు రద్దు చేసేంత వరకు ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడంలో పోటీ పడుతున్నాయని విమర్వి:చారు. కష్ణానది పక్కన పెట్టుకుని ప్రభుత్వం మంచి నీటితో వ్యాపారం చేయడం దారుణమన్నారు. విద్యుత్‌ బిల్లులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రజావ్యతిరేక నీటి మీటర్లు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని, లేదంటే భారాలు మోపే ప్రభుత్వాన్ని సాగ నంపాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం అమత స్కీం పేరుతో ప్రజలపై మోయలేని భారం వేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసంక్షేమ సంఘం సెంట్రల్‌ సిటీ నాయకులు కృష్ణమూర్తి, వై.కృష్ణ, బి.చిన్న, స్థానికులు శ్రీనివాసరావు, యుగంధర్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.