ప్రజాశక్తి-వత్సవాయి: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మిర్చి పంట పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాములూరు మేజర్ కాలువకు సాగునీరు రాకపోవడంతో మంగళవారం చిల్లకల్లు వైరా రహదారిపై రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు పెద్ది రామారావు, ఉయ్యూరు అప్పారావు మాట్లాడుతూ దామలూరు మేజర్ కాలువకు సాగునీరు రాకపోవడంతో దిగువ ప్రాంతాలైన వేములనర్వ, ఖమ్మంపాడు, కాకరవాయి, మాచినేనిపాలెం, వత్సవాయి, కొత్త వేమవరం తదితర గ్రామాల్లో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వేసిన మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే తరుణంలో మిర్చి కాయలు, చెట్లు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరున్నా దాములూరు మేజర్ కాలువకు మాత్రం సాగునీరు రాకుండా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది ఆందోళనలో పాల్గొనడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంత బోనకల్ పోలీసులు పోలీస్ రైతులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.










