Apr 22,2023 19:41

వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న మహిళలు

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
కోసిగిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. శనివారం కోసిగి వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టడంతో దాదాపు గంట పాటు భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టిడిపి ప్రభుత్వంలో తమ కాలనీలో తిక్కారెడ్డి వేసిన తాగునీటి బోరే దిక్కని మహిళలు వాపోయారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వంలో కోసిగి బీరప్ప గుడి కాలనీలో తీరని తాగునీటి సమస్యగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును వినపించడానికే ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించామని కాలనీ మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. కోసిగిలోని 9వ వార్డు బీరప్ప గుడి కాలనీలో గత నాలుగేళ్లుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి వేయించిన తాగునీటి బోరే ఇప్పటికీ దిక్కు అయిందని చెప్పారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వంలో ఇప్పటివరకు తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదని తెలిపారు. తాగడానికి నీరు, సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు, పూడికతీత పనులు కూడా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు వస్తారే తప్ప, తమ సమస్యలు తీర్చడానికి మాత్రం ఇంతవరకు తమ కాలనీ వైపు వైసిపి నాయకులు రావడం లేదని మండిపడ్డారు. తమ కాలనీలో రోజూ గంట కూడా తాగునీరు వదలడం లేదని, ఇక తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది వాహనాలు ఇరువైపులా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఎండవేడిమికి వాహనదారులు, ఇటు బీరప్ప గుడి కాలనీవాసులు అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళలకు సర్ది చెప్పి వారి నీటి సమస్యను తీరుస్తామని అక్కడి నుంచి వారిని వెళ్లగొట్టారు.

వాహనాలను అడ్డుకుంటున్న మహిళలు