Apr 10,2022 12:29

సాయంత్రపు నీరెండలో డాబామీదకి పాకిన విరజాజి తీగను ట్రిమ్‌ చేసి, కుండీల్లో నేను ప్రేమగా పెంచుకున్న కూరగాయలు కోసుకోవాలన్నది ఇవాళ్టి నా సాయంత్రపు ప్రోగ్రాం. అందుకే టీ కప్పుతో సహా పైకెళ్లాను. రంగురంగుల నా మిద్దెతోటని తనివితీరా చూసుకుంటూ, 'టీ'ని ఆస్వాదిస్తూ తాగుతూ నా మొబైల్లో పాటలు పెట్టుకుని వింటూ మొక్కల మధ్య తిరుగుతున్నాను.
అంతలో నాకు కింద వాటాలో నుండి నేను వింటున్న పాటకే శృతి కలిపి పాడుతున్న మరో కొత్త గొంతుక వినపడింది. అది కూని రాగమా? అంటే కాదు శ్రావ్యమైన కంఠంతో నోరారా పాడుతుంది.
'ఆగక పొంగే కన్నీరే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా' ఇక్కడ నా మొబైల్‌ పాట. ఇక్కడ లైన్‌ అయిపోగానే అక్కడా ఆ అమ్మాయి అచ్చం అలాగే 'కొరస్‌'గా పాడుతుంది. 'అరే! భలే పాడుతుందే' అనుకుంటూ కిందకి తొంగి చూశాను. ఎవరో అమ్మాయి దండెం మీద బట్టలారేస్తూ నేను మొబైల్‌లో పెట్టిన పాటకు శృతి కలిపి పాడుతుంది.
దగ్గర దగ్గర ఇరవయ్యేళ్ల లోపు వయసు ఉంటుంది. మొన్నటిదాకా ఆ వాటా ఖాళీగానే ఉంది. మరి వీళ్లు కొత్తగా వచ్చారు కాబోలు అనుకుంటూ నా పని చేసుకుని కిందకు వెళ్లిపోయాను.
తరువాతి రోజు నుండి ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఆసక్తిగా చూడాలనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తుంది. కానీ ఏ పని చేస్తున్నా పాటను మాత్రం వదలడం లేదు. ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది నాకా అమ్మాయిని చూస్తుంటే. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది.
నేను తనను చూసి పలకరింపుగా నవ్వితే మాత్రం బదులుగా హాయిగా ఓ చల్లని నవ్వు నవ్వేసి లోపలికెళ్లి పోతుంది.
తరువాత రోజు వంట చేస్తుండగా కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్లి డోర్‌ తీస్తే ఆ 'కోకిల పిల్లే'.
'ఓV్‌ా! నువ్వా! లోపలికి రామ్మా' నవ్వుతూ లోపలికి పిలిచాను.
'అమ్మా! కాస్త మీ చెట్టు కరివేపాకు కోసుకోనా? బయట కాంపౌండ్లో ఏపుగా పెరిగిన కరివేపాకు చెట్టువైపు వేలితో చూపిస్తూ మొహమాటంగా అంది.
'ఓ దానికేం నీకెంత కావాలో అంత కోసుకెల్దువు గాని, ముందు లోపలికి రా కోకిలా!' అన్నాను నవ్వుతూ.
'అయ్యో! నా పేరు కోకిల కాదమ్మా, ''పద్మ''. మా సారోళ్లు పద్దూ అంటారమ్మ. మొన్ననే పక్క వాటాలోకి వచ్చామమ్మా. మీరు చూస్తున్నారు కదమ్మ! మా సార్‌కి ఈ ఊర్లో ఏశారంటమ్మా ఉద్యోగం. మా అమ్మగారోళ్లు ఈ ఊరికొస్తూ కొన్నాళ్లు పనికి సాయంగా ఉండమని బతిమాలి నన్ను కూడా పిలుచుకొచ్చారమ్మా. మరి ఉంటాయి కదమ్మ సామాన్లు సర్దుకోవడం అయన్నీను. పిల్లలేమో ఎక్కడో దూరంగా చదువుతున్నారాయే!' అంటూ ఆపకుండా నేను అడగకున్నా వివరాలన్నీ చెప్పింది.
'అవునా పద్మా! నువ్‌ అంత బాగా పాటలు పాడుతుంటే నీ పేరు కోకిలనేమో అనుకున్న' జ్యుస్‌ అందిస్తూ నవ్వుతూ అన్నాను.
'కాదమ్మా' అంటూ సిగ్గుపడుతూనే గ్లాస్‌ అందుకుంది.
'ఊరు కాస్త తెలిసేదాక నీకేం కావాలన్నా వస్తుండు పద్మా. మీ అమ్మగారితో కూడా నేను చెప్పానని చెప్పు సరేనా' అన్నాను.
వెంటనే పద్మ తడుముకోకుండా 'మీక్కూడా ఏదైనా పని సాయం అవసరమైతే చెప్పండమ్మ చేసేస్తాను. ఏం మోమాటపడొద్దు' అంటూ ఇల్లంతా కలియచూస్తూ సింక్‌ దగ్గరకెళ్లి గ్లాస్‌ని వద్దన్నా వినకుండా కడిగి పెట్టి వెళ్లిపోయింది.
పల్లెటూరి కలుపుగోలుతనంతో నాకు తొందరగానే దగ్గరయ్యింది. పది వరకూ చదివానని గొప్పగా చెప్పుకుంది. తీరిక దొరికినప్పుడల్లా వచ్చేది. వద్దన్నా వినకుండా నా పనిలో కూడా సాయం చేసేది. తనొచ్చినపుడు నా ఒంటరితనం నాపై అలిగి ఇల్లువదిలెక్కడికో పారిపోయేది.
పద్మ గలగలా కబుర్లు చెప్పేది. ఆ కబుర్లలో ఎక్కువ పాటలగురించే మాటలు దొర్లేవి. నేనెంతో ఇష్టంగా ఆ పాట పాడు, ఈ పాట నీకు తెలుసా పద్మా? అంటూ అడిగితే 'మీరు మరీ అమ్మా! కావాలని నన్ను మెచ్చుకుంటారుగానీ, నా పాట నిజంగా అంత బాగుంటుందా?' అనేది.
'నిజం పద్మా! నీ పాటలో ఓ హాయి ఉంటుంది తెలుసా!' అంటే తెగ సంబరపడేది. నా యాభై సంవత్సరాల వయసుకి తగ్గ గౌరవం ఇచ్చేది. నేను ఒంటరిగా ఉంటానని బోలెడు జాలిపడేది. మాటల్లో స్వచ్ఛత, ఆ కలుపుగోలుతనం, కల్మషంలేని తన మనసు ఇవన్నీ పద్మలో నాకు చాలా బాగా నచ్చేవి.

                                                               ***

తరువాత రోజు సాయంత్రం కాస్తాలస్యంగా నా దగ్గరికి వచ్చింది పద్మ. 'ఏం పద్మా! పనయిపోలేదా ఇవాళ ఆలస్యమయిందే' అంటే ...
'హ్హ అమ్మా! దసరా పండుగొస్తుంది కదమ్మా! సెలవులకు అమ్మగారోళ్ల పిల్లలొస్తారంటమ్మా. కారప్పూసా, లడ్డులూ చేసొస్తున్న' అంది కాస్త నీరసంగా! కాసేపు ఆ మాట ఈ మాట చెప్పేసి వెళ్లిపోతుంటే వెనక్కి పిలిచి చెయ్యి పట్టుకుని గుప్పెట్లో నాలుగు ఐదువందల కాగితాలు పెట్టాను. 'అయ్యో డబ్బులా! ఎందుకమ్మా???' అంటూ ఉలిక్కిపడి దూరం జరగబోయింది.
'పండక్కి కొత్తబట్టలో ఇంకేమైనా నీకు కావాల్సినవి కొనుక్కో పద్మా' అంటే నన్ను హత్తుకుని తన సంతోషాన్ని తెలిపి ఆనందంగా వెళ్లిపోయింది.

                                                                 ***

ఓ నాలుగు రోజులు పద్మకు పని ఒత్తిడితో మా కబుర్లకు తీరుబడి కాలేదు. కిందనుండే పలకరించేది. అలా వారం గడిచిపోయింది.
ఓ రోజు హడావిడిగా నా దగ్గరకొచ్చింది పద్మ. 'అమ్మా! మీ సెల్లుఫోన్‌ ఓసారి ఇవ్వండి అంది' నే ఇవ్వగానే ''యూట్యూబ్‌'' ఓపెన్‌ చేసి ''ఇది సూడండమ్మా'' అని ఓ వీడియోని ఓపెన్‌ చేసి నా ముందు పెట్టింది. ఆ వీడియోలో పద్మ పనిచేస్తూ పాట పాడుతుంది. అందంగా వీడియోగా చేసి, యూట్యూబ్లో పెట్టారు. అప్పటికే బోలెడు వ్యూస్‌, షేర్లు జరిగిపోయాయి.
అదంతా చూసి నేను కూడా సంతోషంగా 'భలే న్యాచురల్‌గా ఉన్నావు పద్మా! నీ పాటెప్పుడూ సూపరే లే' తన భుజం తట్టి ఆనందంగా అన్నాను.
'థాంక్సమ్మ ! మరేమో నా పాట నచ్చి మా అమ్మగారి కూతురు చేసిందమ్మా ఇదంతాను. మీరు కూడా సబ్‌స్క్రైయిబ్‌ అంట చెయ్యండమ్మా' అంది సిగ్గుపడుతూ.
'ఓ దానికేం ఇప్పుడే చేసేద్దాం' అంటూ మరింత ఉత్సాహపరిచాను.
సోషల్‌ మీడియా పుణ్యమా అని అతి తొందరగా నలుగురి కళ్లలో పడిందా వీడియో. వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లలో చక్కర్లు కొట్టింది. కొన్ని నెలల్లోనే ఎట్టకేలకు పద్మ టీవీలో ఓ పాటల ప్రోగ్రాంలో సెలక్ట్‌ అయ్యింది. అప్పటిదాకా సంతోషంగా ఇదంతా చూసిన నేను. తీరా టీవీ షోలో పద్మని చూడగానే నా ముఖం చిన్నబోయింది.
మొదటిసారి మేకప్‌తో పద్మ. ఆ ముఖంపై అరువుకు తెచ్చుకున్న నవ్వు. హాయిగా నోరారా అద్భుతమైన గాత్రంతో పాడే పద్మ ఇపుడు అక్షరాలని అదిమి పెట్టి పాడుతుంది. గలగల సెలయేరులా మాట్లాడే పద్మ ఆచితూచి మాట్లాడుతుంది. అసలక్కడ నాకు తెలిసిన, దగ్గరైన పద్మనే కాదన్నట్టుగా ఉంది. ముఖానికి మాత్రమే మేకప్‌ ఉంటే పర్లేదు. తన కల్మషం లేని తెల్లని మనసుకు ఈ మాయాలోకపు రంగులు అంటుకుంటాయేమోనన్న ఆలోచన రాగానే మనసెందుకో భారంగా నిట్టూర్చింది.

                                                               ***

టీవీని చూడడం ఈ మధ్య బాగా తగ్గించేశాను. ఎందుకో ఏ ప్రోగ్రామ్స్‌ నచ్చడం లేదు. కానీ పద్మకోసమని ఆ పాటల ప్రోగ్రామొక్కటి మాత్రమే చూస్తున్నాను.
స్టేజి మీద పద్మ పాట పాడుతుంది. పద్మని చూస్తుంటే నాలో ఏదో వెలితి.
'పద్మ నిజంగానే బురదలో పుట్టినా సువాసనలు వెదజల్లే పుష్పం' అంటూ ప్రాసకోసం పాకులాడుతూ ఒక్కటే ఊదరగొడుతుంది ఆ యాంకరమ్మ. 'బీదరికం తనకు శాపమంటూ, మట్టిలో మాణిక్యం అంటే నిజంగా పద్మనే' అని ఇంకా ఇంకా ఏదేదో చెప్తుంది.
చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. అక్కడ పాడే వారందరూ మొదటి సారి అవకాశం దక్కించుకున్నవారే! నిజంగా మెచ్చుకోతగ్గదే! కానీ చీటికీ మాటికీ అద్భుతం అని, ప్రతి లైనుకీ ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేయడం, సినిమాలో పాడే అవకాశం అతి తొందర్లోనే వస్తుందని ఊరింపులు. ఒకరిని మించి మరొకరు పోటీలు పడి ప్రామిస్‌లు చేసేయడం నాకు అసలు నచ్చలేదు. అలా అయితే వారికి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి వస్తుందా? అని నాకు అనుమానమొస్తుంది.
ఇదివరకు కాళ్లు అరిగేవరకూ తిరిగితే కానీ ఏ అవకాశాలూ దొరికేవి కావు. అది కూడా అరకొరగా. కానీ ఇప్పుడు ఎవరికి వారే సోషల్‌ మీడియాలో ప్రతిభ చూపెట్టి ''ఫేమస్‌?'' అవుతున్నారు. కానీ ఎన్నాళ్లీ గుర్తింపు నిలుస్తోంది అంటే మాత్రం ఎవరూ చెప్పలేరు.
ఎందుకో పద్మ మీద జాలేసింది. ఆ అమ్మాయి ఏ గుర్తింపు లేకుండా పనిపిల్లగానే మిగిలిపోవాలని నా ఆలోచన ఎంత మాత్రం కానే కాదు. కానీ తనది కానీ ముఖాన్ని తగిలించుకుని బతకడానికి సిద్ధమవుతున్న పద్మ ఇదివరకులా స్వేచ్ఛగా బతకగలదా? ఆడంబరపు పంజరంలో ఇమడగలదా? అని ఒక చిన్న ఆందోళన. ఒక్కసారిగా వచ్చిన ఈ గుర్తింపు పద్మ బతుకుకు ఓ ఆసరా అయితే పర్లేదు. ఆనందాన్నిస్తే ఇంకా సంతోషమే!...
కానీ తన గొంతు ఇంకొకరికి పెట్టుబడినో, వ్యాపారమో కాకూడదు. ఈ పిచ్చి పద్మ అటు ఆడంబరాల అందలం ఎక్కలేక. ఇటు తిరిగి తన పాత జీవితంలో ఇమడలేకపోతేనే కష్టం. ఇదొక్కటే నా మనసులో సుడులుగా తిరిగే బాధ.
తరువాత ఎపిసోడ్‌లలో పద్మను స్టేజి మీద చాలా సార్లు చూశాను. తనెప్పుడూ వేయని జీన్స్‌, టీ షర్టులలో రకరకాల మోడ్రన్‌ డ్రెస్సుల్లో చూశాను. చూసే కొద్దీ పద్మ నాకు అపరిచితురాలిగా కనిపించసాగింది. పద్మకి థర్డ్‌ ప్రైజ్‌ వచ్చింది.
తరువాత పద్మ వాళ్ల ఊరెళ్లిపోయిందని తెలిసింది. పోన్లే, ఎక్కడున్నా తను హాయిగా ఉంటే చాలనుకున్నా. తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి.

                                                                ***

ఓ ఉదయం వాట్సాప్‌లో సన్నిహితులు పంపిన శుభోదయం మెస్సేజ్‌లూ, వీడియోలు చూస్తున్నాను.
ఒక వీడియో ఓపెన్‌ చేయగానే .....
'పాడే కోకిల మూగబోతే పలకరించేదెవరూ?
కడుపు నింపని కళలెందుకు?
తనకి మాలిన ధర్మమెందుకు??'
పద్మ పాడుతుంది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ అది.

ఆనందాశ్చర్యాలతో పద్మ మాటలని ఇంకా శ్రద్ధగా వింటున్నాను.
యాంకర్‌ అడుగుతుంది. 'పద్మా! నిన్ను చూసి చాలా ఇయర్స్‌ అయిపోయింది. ! చాలా మారిపోయావు. చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూడడం. మా ఛానల్‌ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?' అని.
'అవును అమ్మకి ఒక మాట చెప్పాలి. అమ్మ అంటే నా పాటని ఎంతో ఇష్టపడే మా వైశాలి అమ్మకి ఒక క్షమాపణ చెప్పాలి. నా ఎదుగుదలని చూసి వైశాలి అమ్మ మెచ్చుకోక పోతే ఆవిడకి ''అసూయనేమో'' అనుకున్న. కానీ ''ఈ ఆడంబరాలన్నీ మెరిసే రంగుల నీటి బుడగలు పద్మా''. అని అమ్మ ఎందుకనేదో త్వరగానే అర్థం అయ్యింది. ఉవ్వెత్తున ఎగిసే కెరటంలాంటిదే ఈ సోషల్‌ మీడియాతో వచ్చే గుర్తింపు కూడా. ఎంత వేగంగా గుర్తింపు వస్తుందో అంతే వేగంగా మరుగున పడిపోతాం. కళలు కడుపు నింపవు. ఇది నిజము. అందరూ కాకున్నా నాలాంటి కొందరయినా ఈ మాటని ఒప్పుకొని తీరతారు.
జీవితంలో ఆనందం అనేది ఎక్కడో ఉండదని తెలుసుకున్నాను. ఎవరిపైనా ఆధారపడి బతకకూడదనుకున్నా. నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. అందుకే సొంతంగా ఈ లెదర్‌, జ్యూట్‌ బ్యాగ్స్‌ యూనిట్‌ రన్‌ చేస్తూ నాతో పాటూ నలుగురికీ ఉపాధినిస్తున్నాను' అంది పద్మ.
చాలా సంవత్సరాలకు పద్మను చూశానన్న ఆనందం. తన మాటల్లో స్పష్టత. జీవితంపై కాన్ఫిడెంట్‌నీ చూసి చాలా గర్వంగా ఫీల్‌ అయ్యాను.. అన్నిటికన్నా తాను నా పేరుని చెప్తూ నా మాటలని గుర్తుపెట్టుకొని తన జీవితాన్ని ఉన్నత శిఖరాల వైపు మలుపుతిప్పుకున్న విధానం నాకెంతో సంతృప్తి నిచ్చింది.

శారద పోరాల
Sharadad46@gmail.com