ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ లేవనెత్తిన అభ్యంతరాలు సహేతుకమైనవి. నీట్ నుండి తమిళనాడు విద్యార్థులకు మినహాయింపు ఇస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆచరణ లోకి రావడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడాలన్నది వేరే సంగతి. దీంతో పాటు నీట్‌పై తాము చేస్తున్న పోరాటంతో కలిసి రావాలని కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. లేఖతో పాటు తమ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును, విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు నియమించిన జస్టిస్ ఎ.కె రాజన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ఆయన ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపారు. వీటిని అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలోనే నీట్ రద్దుకు డిఎంకె హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత జస్టిస్ ఎ.కె రాజన్ నేతృత్వంలో నీట్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఒక కమిటీని నియమించింది. క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత 20 కారణాలను పేర్కొంటూ నీట్ నుండి బయటకు రావాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఇవి ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన కారణాలు కావు. నీట్‌తో విద్యార్థుల మధ్య అంతరాలు ఎలా పెరిగిపోతాయో, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎలా నష్టపోతారో, రాష్ట్రాల హక్కులు ఎలా దెబ్బ తింటాయో ఆ కమిటీ సోదాహరణంగా వివరించింది.
రాజ్యాంగం రాసిన తొలినాళ్లలో విద్య పూర్తిగా రాష్ట్రాల పరిధి లోనే ఉండేది. 42వ రాజ్యాంగ సవరణతో దీనిని ఉమ్మడి జాబితా లోకి తీసుకువచ్చారు. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వాల జోక్యం పెరుగుతూ వచ్చింది. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడి మరింత తీవ్రమైంది. రాష్ట్రాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ బలవంతంగా రుద్దుతున్న నూతన విద్యావిధానం, నీట్ వంటి పరీక్షలతో ఎడాపెడా ఈ దాడి సాగుతోంది. ఈ రెండింటిని తమిళనాడు ప్రభుత్వం నిష్కర్షగా తిరస్కరిస్తుండగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దానికి భిన్నంగా స్పందిస్తున్నాయి. రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రజలందరికి సమాన హక్కులను, సమాన రక్షణను గ్యారంటీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నీట్‌తో ఈ రక్షణ చట్రం ధ్వంసమవుతోంది. మొదటి నుండి సిబిఎస్‌ఇ సిలబస్ చదివిన విద్యార్థులను, వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డుల పరిధిలో చదివిన వారిని ఒకే గాటన కడుతుంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సమాన అవకాశాలను కోల్పోతారు. ఇంతేకాకుండా, స్థానిక పరిస్థితులకనుగుణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక పాఠ్యాంశాలను, సిలబస్‌ను రూపొందించుకునే సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌కు ఈ భిన్నత్వం పట్టదు. సిబిఎస్‌ఇ సిలబస్ ఆధారంగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికితోడు మాధ్యమం కూడా సమస్యగా మారుతోంది. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల కనుగుణంగా రూపొందిన రిజర్వేషన్ల అమలు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. వీటన్నింటి ప్రభావం విద్యార్థులపై తీవ్ర స్థాయిలో పడుతోంది. నీట్ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా తమిళనాడులో చోటుచేసుకున్నాయి.
ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఘటనలు మన రాష్ట్రంలో కొత్త కాదు. ఆ పరిస్థితి మరింత తీవ్రం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. నిజానికి దశాబ్ద కాలం కిందట 2010లో యుపిఎ ప్రభుత్వం నీట్ ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం దానిని వ్యతిరేకించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ నీట్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయనే ప్రధానిగా నీట్ అమలుకోసం ఒత్తిడి చేస్తుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా దాని అమలుకు తలూపుతోంది. 2010లో వ్యతిరేకించడానికి కానీ, ఇప్పుడు అమలు చేయడానికిగానీ ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయ కారణాలే ప్రధానం కావడం బాధాకరం. విద్యార్థుల భవిష్యత్తుపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి. మోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు తొలుత మద్దతిచ్చినా, రైతాంగ పోరాటం నేపథ్యంలో మళ్లీ పునరాలోచనలో పడి ఇటీవల జరిగిన బంద్‌కు మద్దతు ఇచ్చిన విధంగానే నీట్ విషయంలోనూ పునరాలోచించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవకాశాలను సమూలంగా దెబ్బతీసే నీట్‌ను వ్యతిరేకించాలి.










