Dec 14,2022 21:54

ప్రజాశక్తి - ముదినేపల్లి
                  మండలంలోని గురజలో వరి చేలు నీట మునిగాయి. ఆక్వా సాగు చేసే రైతులు తమ చెరువుల్లోకి నీటిని నింపటానికి పంట కాల్వ ద్వారా నీటిని తీసుకువెళ్లడంతో పంట కాల్వ వెంబడి ఉన్న వరిచేల్లోకి నీరు వెళ్లి కోసిన వరి పనలు, నీట ముగిగాయని వరి రైతులు చెబుతున్నారు. వంద ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరి, కోసిన వరి పనలు నీట మునిగాయంటున్నారు. కాల్వకు నీరు సరఫరా చేసే లాకు శిథిలావస్థకు చేరినా అధికారులు స్పందించడంలేదన్నారు. దీంతో పోల్‌రాజ్‌ కెనాల్‌కు నీటి మట్టం పెంచి చేపల చెరువులకు జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నట్లు రైతులు తెలిపారు. కోతలు కోసే దశలో నీరు ఆకస్మాత్తుగా వచ్చి చేలను ముంచి వేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆరుతడి పంట మినుము విత్తనాలు చేల్లో చల్లామని, చేల్లో నీరు నిలిచిపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదని చెప్పారు. చేలల్లో నీరు బయటకు వెళ్లడానికి కనీసం వారం రోజులు పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు స్వార్థం కారణంగా పంట నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.