ప్రజాశక్తి - ఆరిలోవ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు విశాఖ కేంద్రకారాగారం ఎదురుగా గల రామకృష్ణాపురం కాలనీ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాతం ఇళ్ళలోకి నీరు వచ్చి చేరింది. గెడ్డలో పెద్ద ఎత్తున చెత్త, గడ్డి చేరడంతో నీరు పోయే మార్గం లేక పొంగి గెడ్డ అంచున ఉన్న సుమారు 20 ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఇంట్లో చేరిన నీటిని బయటకు పంపించేందుకు నివాసదారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న జివిఎంసి రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకొని జెసిబిలతో గెడ్డలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. దీంతో నీరు పోయేందుకు మార్గం సుగమం అయింది. చినగదిలి తహశీల్దారు కిరణ్‌పాల్, జోనల్ కమిషనర్ బి.రాము, వైసిపి నాయకులు ముంపునకు గురైన కాలనీని సందర్శించి పరిశీలించారు. ముంపునకు గల కారణాలు తెలసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.










