
శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అనేది శాసనాలను రూపొందించే క్రమంలో ఒక భాగం మాత్రమే కానీ, కార్యనిర్వాహక అధికారం కాదు. కానీ ఏ విధమైన ఆలస్యం చేయకుండా గవర్నర్, రాజ్యాంగం కల్పించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏదో ఒక దానిని అమలు చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టే చర్యలకు సాధారణంగా గవర్నర్లు పూనుకోరు. రాష్ట్రపతి నియమించిన గవర్నర్...ఒక బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టడమంటే ...ప్రజలెన్నుకున్న శాసనసభ ప్రతినిధులు ఆమోదించిన శాసనాలు అమలు కాకుండా నిరర్ధకం చేస్తున్నట్టే.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' (నీట్) బిల్లు (అఖిల భారత మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన) ఆమోదం విషయంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికీ, రాష్ట్ర గవర్నర్‌కూ మధ్య తలెత్తిన వివాదానికి తమిళనాడు సాక్షీభూతంగా నిలిచింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడమనేది, రాజ్యాంగపరంగా గవర్నర్ లాంఛనప్రాయంగా నెరవేర్చే బాధ్యత. కానీ, గవర్నర్లు లాంఛనంగా నెరవేర్చాల్సిన ఈ బాధ్యతలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల నడవడికను పరిశీలిస్తే రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారికీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకూ ఆందోళన కలిగించే ఒక నిర్దిష్టమైన నమూనాను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
మంత్రుల సలహా మేరకు...
రాజకీయ పాలనాపరమైన సందర్భాల్లో రాష్ట్రాల్లో కాలానుగుణంగా వస్తున్న గవర్నర్ చర్యల ప్రాధాన్యతలను తెలుసుకోవాలంటే భారతదేశంలోని రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలో గవర్నర్ స్థానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్‌ను నియమించేది రాష్ట్రపతి. అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందన్నమాట. మన రాజ్యాంగం లోని ఆర్టికల్ 154(1) గవర్నర్‌కు కార్యనిర్వహణ అధికారాలను ఇచ్చినప్పటికీ, ఆయన ఆ అధికారాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే గవర్నర్, మంత్రి మండలి సహకారంతో, వారి సలహా మేరకు తన అధికారాన్ని ఉపయోగించాలి. షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (1974) కేసు విషయంలో, 'వివిధ ఆర్టికల్స్ కింద ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలకు సంరక్షకులైన రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగపరంగా లాంఛనప్రాయమైన కార్యనిర్వాహక అధికారాలను మంత్రిమండలి సలహాల మేరకు మాత్రమే నిర్వహిస్తార'ని సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది.
బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో గవర్నర్ స్థానాన్ని గురించి రాజ్యాంగ పరిషత్‌లో మాట్లాడుతూ, 'రాజ్యాంగపరంగా గవర్నర్‌కు తనకు తానుగా నిర్వహించే విధులేమీ లేవ'ని అన్నారు. 'సలహాలకు సంబంధించిన విషయంలో మంత్రిమండలి శాసనసభ విశ్వాసం పొందేంత వరకు (రాజ్యాంగానికి వ్యతిరేకం కాకుంటే) గవర్నర్‌కు విధేయతను ప్రకటించినట్లే అనేది చాలా ముఖ్యమైన నిబంధన'ని గవర్నర్ స్థానం గురించి సర్కారియా కమిషన్ తన నివేదికలో పునరుద్ఘాటించింది. నాబం రెబియా కేసులో, 2016లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ అధికారాలకు సంబంధించి పైన చెప్పిన అంశాలనే నొక్కి చెప్పింది.
అందుబాటులో ఉన్న మార్గాలు
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 'నీట్' బిల్లును రెండు నెలల కాలం గడచినప్పటికీ ఆమోదించకుండా, ఎటూ తేల్చకుండా తొక్కిపెట్టిన ఆ రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించి, అసలు గవర్నర్ అధికారాలు ఏమిటనే అంశాలను తెలుసుకునేందుకు పాఠకులకు ఈ విశ్లేషణ ఇస్తున్నాను. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక బిల్లుకు ఆమోదం తెలుపడానికి గవర్నర్ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి ?
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక బిల్లును తన ఆమోదం కోసం పంపినప్పుడు, మన రాజ్యాంగం ఆర్టికల్ 200 ద్వారా గవర్నర్‌కు నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతుంది. ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే, గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం అవసరం. గవర్నర్ వెంటనే తన ఆమోదాన్ని తెలియజేయవచ్చు. లేదా నిరాకరించవచ్చు. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును నిలిపి ఉంచవచ్చు. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలుపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. నాల్గవ ప్రత్యామ్నాయ మార్గం ప్రకారం, బిల్లును శాసనసభకు తిప్పి పంపుతూ పున:పరిశీలన చేయమని కోరవచ్చు. గవర్నర్ ఆ బిల్లుకు ఏదైనా సవరణ చేయమని కూడా సూచించవచ్చు. గవర్నర్ నుండి బిల్లు తిరిగి వచ్చిన తరువాత ఆయన సిఫార్సులను శాసనసభ వెంటనే పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ శాసనసభ...గవర్నర్ సూచించిన సవరణలను అంగీకరించకుండానే బిల్లును ఆమోదించి, తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపిస్తే...గవర్నర్ దానిని రాజ్యాంగబద్ధంగా ఆమోదించాలి.
తమిళనాడు గవర్నర్ 'నీట్' బిల్లును పున:పరిశీలన చేయాలని కోరుతూ రాష్ట్ర శాసనసభకు తిప్పి పంపించారు. దాని ప్రకారమే శాసనసభ ఫిబ్రవరి మొదటి వారంలో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి మరల గవర్నర్ ఆమోదానికి పంపించింది. కానీ ఇంతవరకు ఆయన ఆ బిల్లుకు ఆమోదం తెలుపలేదు.
తప్పుడు ఉద్దేశ్యం
ఈ క్రమంలో, బిల్లును ఫలానా సమయం లోపే తేల్చేయాలని మన రాజ్యాంగం ఎటువంటి సమయాన్ని నిర్దేశించలేదని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. మన రాజ్యాంగం బిల్లు ఆమోదానికి ఏ విధమైన సమయాన్ని నిర్దేశించలేదు కాబట్టి, గవర్నర్ తన నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయవచ్చని రాజ్ భవన్ వర్గాలు పేర్కొనడం దారుణం.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 200 కింద నిర్వహించాల్సిన బాధ్యతల విషయంలో గవర్నర్‌కు ఎటువంటి సమయాన్ని నిర్దేశించలేదనేది నిజమైనప్పుడు, అదే ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏదో ఒక దానిని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఒక రాజ్యాంగబద్ధమైన అధికారం రాజ్యాంగంలోని నిబంధనలను తొలగించకూడదు. ఆర్టికల్ 200లో పేర్కొనబడిన ప్రత్యామ్నాయ మార్గాన్ని గవర్నర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమలు జరపాలి. సరైన నిర్ణయం తీసుకోడానికి ఆర్టికల్ 200ను ఏర్పరచిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభలో బిల్లును ఆమోదించిన వెంటనే దాన్ని గవర్నర్‌కు పంపుతారు. బిల్లు తరువాత దశకు చేరుకోడానికి గవర్నర్ ఎంత సమయం తీసుకోవాలనే విషయం ఆర్టికల్ 200 చెప్పకపోయినప్పటికీ, అది చాలా స్పష్టంగా గవర్నర్ అమలు చేయాల్సిన పనికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను పేర్కొనడం జరిగింది. ఒకవేళ గవర్నర్ ఆ నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని అమలు చేయకపోయినా ఆయన రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదనుకోవాలి. ఎందుకంటే ఏ పనీ చేయకుండా ఉండడమనేది కూడా ఆర్టికల్ 200లో పేర్కొనలేదు.
రాష్ట్ర శాసనసభ ఆమోదించి, తన ఆమోదానికి పంపిన బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లును తొక్కిపెట్టి ఉంచడాన్ని రాజ్యాంగం అనుమతించదు. గవర్నర్ సిఫార్సులను పున:పరిశీలన చేసి, దానిని ఆయనకు పంపించిన తరువాత, దానికి ఆమోదం తెలపకుండా నిలిపి ఉంచరాదని ఆర్టికల్ 200 స్పష్టంగా చెపుతుంది. ఆర్టికల్‌లో నిర్దిష్ట సమయాన్ని సూచించలేదన్న విషయాన్ని అవకాశంగా తీసుకొని, శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండా, తన ఇష్టం వచ్చినంత కాలం నిలిపి ఉంచాలనే ఉద్దేశ్యం రాజ్యాంగ నిర్మాతలకు కూడా లేదు. వాస్తవానికి, 'శాసనసభ గవర్నర్‌కు సమర్పిస్తుంది, గవర్నర్ ప్రకటిస్తాడు' అనే ఆర్టికల్ 200లో పేర్కొన్న మాటలు, 'ఆమోదం కోసం బిల్లును సమర్పించిన మీదట గవర్నర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పందించాలని రాజ్యాంగం చెప్తుంది' అనే విషయాన్ని సూచిస్తాయి. బిల్లు అత్యవసరం కాబట్టి, శాసనసభ బిల్లును ఆమోదించింది. కానీ ఒకవేళ గవర్నర్ స్పందించకుంటే, శాసనసభ సంకల్పానికి ఆశాభంగం కలుగుతుంది. రాజ్యాంగ విధానం, శాసనసభ సంకల్పానికి బిల్లు ద్వారా ఆశాభంగం కలిగించలేదు. అందువలన, రాష్ట్ర శాసనసభ పున:పరిశీలన చేసిన తరువాత, గవర్నర్‌కు బిల్లును మళ్ళీ సమర్పించిన తరువాత బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టడానికి రాజ్యాంగం అనుమతించలేదు.
అప్రజాస్వామిక ప్రత్యామ్నాయ మార్గం
శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అనేది శాసనాలను రూపొందించే క్రమంలో ఒక భాగం మాత్రమే కానీ, కార్యనిర్వాహక అధికారం కాదు. కానీ ఏ విధమైన ఆలస్యం చేయకుండా గవర్నర్, రాజ్యాంగం కల్పించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏదో ఒక దానిని అమలు చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టే చర్యలకు సాధారణంగా గవర్నర్లు పూనుకోరు. రాష్ట్రపతి నియమించిన గవర్నర్ ఒక బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టడమంటే... ప్రజలెన్నుకున్న శాసనసభ ప్రతినిధులు ఆమోదించిన శాసనాలు అమలు కాకుండా నిరర్ధకం చేస్తున్నట్టే. ఇది అప్రజాస్వామికం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. బ్రిటన్ లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు ఆమోదాన్ని తిరస్కరించడం రాజ్యాంగానికి విరుద్ధమైన అంశం. అదే విధంగా, ఆస్ట్రేలియాలో రాజు ఒక బిల్లును ఆమోదించకుండా తిరస్కరిస్తే, అది ఫెడరల్ వ్యవస్థకు ప్రతికూలమైన విషయంగా భావిస్తారు.
మన రాజ్యాంగ వ్యవస్థలో, రాష్ట్రపతి లేదా గవర్నర్లు తమ చర్యలకు వ్యక్తిగతంగా బాధ్యత వహించరు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 361 ప్రకారం తమ అధికారాలు, బాధ్యతల నిర్వహణా క్రమంలో జరిగే పరిణామాలకు రాష్ట్రపతి లేదా గవర్నర్లు...ఏ కోర్టుకూ జవాబుదారీగా ఉండరు. కానీ తన ఆమోదం కోసం పంపించబడిన బిల్లు విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోనపుడు, ఆయన తన విధులను నెరవేర్చడంలేదని భావించాల్సి ఉంటుంది.
(వ్యాసకర్త లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్)
/ 'హిందూ' సౌజన్యంతో /
పి.డి.టి. ఆచారి