నీరు వృధా... బతుకు వ్యథ..!
ఊసేలేని 'ఆర్లపెంట వంక' ప్రాజెక్టు
వృధా అవుతున్న తలకోన వర్షపునీరు
ఉస్తికాయలపెంట రైతుల ఆవేదన
ప్రజాశక్తి - యర్రావారిపాలెం
తలకోన.. జిల్లాలోనే ఆహ్లాదకరమైన చల్లని ప్రాంతం.. ఎంతటి ఎండాకాలమైనా ఇక్కడి జలపాతం ప్రవహిస్తూనే ఉంటుంది. అదే వర్షాకాలమైతే చెప్పాల్సిన పనిలేదు. తలకోన అందం చూడతరం కాదు.. అయితే తలకోన దిగువ భాగంలోని ఉస్తికాయలపెంట గ్రామ పంచాయతీలో మాత్రం కరువు విలయతాండవం చేస్తుంది. ప్రకృతి కరుణించి వర్షం కురిసినా నీటిని నిల్వ ఉంచుకోలేక దశాబ్దాలుగా పంటల సాగుకు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. మెట్ట ప్రాంతం కావడం, చెరువులు, వంకలు, వాగులు పూడిపోవడంతో వర్షపు నీరు నిలిచే పరిస్థితి లేదు. చిన్నసన్న కారు రైతులు లక్షలు పెట్టి బోర్లు, విద్యుత్ కనెక్షన్లు తీసుకోడానికి ఆర్థిక స్థోమత లేక విలవిలలాడుతున్నారు. దీనికంతటికీ పరిష్కారంగా గ్రామ సమీపంలో ఆర్లపెంట వంకకు అనుసంధానం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తే తమ ప్రాంతాన్ని కరువు నుంచి విముక్తి చేయవచ్చని ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
తలకోన వర్షపునీరు వృథా
వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో కురిసే వానంతా తలకోన నుంచి వంకలు, వాగులు ద్వారా ప్రవహిస్తూ దిగువకు వృధాగా పోతోంది. ఈ నీటిని నిల్వ ఉంచుకోడానికి ఆర్లపెంట వంకను ప్రాజెక్టుగా నిర్మించితే 28 చెరువులకు నీరు చేరుతుంది. ఫలితంగా 800 ఎకరాలు ఆయకట్టుతో పాటు బోర్లపై ఆధారపడుతున్న 2వేల ఎకరాలకు పంటలు పండించుకోడానికి అవకాశం ఉంది. ఉస్తికాయలపెంట ప్రాంతంలో 28 గ్రామాలలో 704 కుటుంబాలు ఉన్నాయి. 3వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 677 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి సాగునీరు లేక కొంతమంది కూలీలుగానూ, మరికొంతమంది పట్టణాలకు పనుల కోసం వలస వెళుతున్నారు. గ్రామ ప్రాంతంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోడానికి సరైన ప్రాజెక్టులు, చెరువుల పూడికతీత పనులు చేస్తే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. తలకోన నీరు వృధా కాకుండా ఉండాలంటే చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్లపెంట వంక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధులు గానీ, సంబంధిత అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.










