పాడైపోతున్న రాజీవ్ గృహకల్ప సముదాయం
తాగునీరు లేకనే నివాసముండేందుకు విముఖత
పేరుకుపోతున్న పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు
పాములు, విషకీటకాలకు ఆవాసంగా మారిన వైనం
500 ఇళ్లల్లో 30 కుటుంబాలైనా ఉండని దుస్థితి
అవస్థలు పడుతున్న నేరెళ్లవలస కాలనీ నివాసితులు
ప్రజాశక్తి - భీమునిపట్నం
మండలంలోని నేరెళ్లవలస కాలనీలోని రాజీవ్‌గృహకల్ప సముదాయం నిరుపయోగంగా మారుతోంది. దాదాపు 500కుటుంబాలనిరుపేదలు నివాసముండేందుకు నిర్మించిన ఈ కాలనీలో, ప్రస్తుతం పట్టుమని 30 కుటుంబాలైనా లేరంటే పరిస్థితి ఎంత దయనీయమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికీ ప్రధాన కారణం, ఈ కాలనీలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి ఎద్దడేనని అధికారులు, నేతలకు తెలిసేలా స్థానికులు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా గృహసముదాయంలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పేరుకుపోయి, పాములు, విషకీటకాలకు ఆవాసరగా మారిపోతోందని ఇక్కడి నివాసితులు ఆందోళన చెందుతున్నారు.
2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 500 నిరుపేద కుటుంబాలు నివాసముండేలా నేరెళ్లవలసలో రాజీవ్ గృహకల్ప గృహసముదాయాన్ని నిర్మించారు. అప్పట్లో ఇక్కడి నివాసితుల తాగునీటి అవసరాల కోసం గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రక్షితనీటి పథకాన్ని కూడా నిర్మించారు. అయితే కొన్నాళ్లక్రితం ఆ నీటిపథకం పాడై, నిరుపయోగంగా మారడంతో ప్రజలు దాహార్తితో అల్లాడిపోక తప్పడం లేదు. స్థానికుల విజ్ఞప్తి మేరకు కొద్దిరోజులుగా జివిఎంసి ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వీరికి నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్ తుప్పు పట్టివుండడంతో అనారోగ్యం బారిన పడతామేమోనన్న భయంతో ఆ నీటిని తాగేందుకు వాడకుండా, స్నానాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
తాగునీరు లేకనే నివాసానికి దూరం
తాగునీటి సదుపాయం లేకనే ఇక్కడ ఉండేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదని ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న వారు చెబుతున్నారు. 500 కుటుంబాలు ఉండాల్సిన చోట, కేవలం 30 కుటుంబాలే ఉంటున్నయంటే ఇక్కడి పరిస్థితిని అంచనా వేయొచ్చు.
పేరుకుపోతోన్న ముళ్లపొదలు
ఇతర ప్రాంతాల్లో వేలల్లో అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఈ కాలనీలో ఉండేందుకు ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నీటి సదుపాయం లేక నివాసితులు రాకపోవడంతో, నిరుపయోగంగా ఉన్న గృహసదుపాయం లోపల, చుట్టూరా పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పేరుకుపోయి భయానకంగా మారిందని స్థానికులు ఆవేదన చెందు తున్నారు. పాములు, విషకీటకాలకు ఆవాసంగా మారిందని వాపోతున్నారు.
రోజూ తాగునీరు అందించాలి
జ్యూట్ మిల్లు శాశ్వతంగా మూతపడడంతో, తగరపువలసలో భారీగా ఉన్న అద్దెలు చెల్లించలేక సొంతింటికి వచ్చాం. ఇక్కడ నీరు లేకపోవడంతో సుమారు కిలోమీటరు దూరం నుంచి క్యాన్‌లో తాగునీరు తెచ్చుకుని కాలం వెల్లదీస్తున్నాం. రోజూ తాగునీరు అందిస్తే అన్ని ఇళ్లు నిండుకుంటాయి.
అన్నాబత్తుల నరసింగరావు, కాలనీ నివాసితుడు
----------
నిత్యం చస్తూ బతుకుతున్నాం
తాగునీరు లేకపోవడం వల్లే కేటాయించిన ఇళ్లల్లో ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ముందుగా తాగునీటి కష్టాలను తీర్చాలి.ఈలోగా గృహసముదాయంలో పేరుకుపోయిన పిచ్చిమొక్కల్ని తొలగించి బాగుచేయాలి. పాముల భయంతో నిత్యం చస్తూ బతుకుతున్నాం.
గిడుతూరి కృష్ణవేణి, నివాసిత మహిళ










