ప్రజాశక్తి- అద్దంకి : పంటలను కాపాడుకొనేందుకు నీరు అడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తామని చెప్పడం వైసిపి ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఎమ్మెల్యేను కలిసి పంటలు చివరి దశలో ఉన్నాయని,ఈ సమయంలో ఆరుతడులకు నీరందకపోతే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఈ విషయం గురించి అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు. చేసేది లేక రైతులందరూ కలిసి నీరు ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించినట్లు తెలిపారు. అయితే పోలీసులు తమపై కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఏం నేరం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వారిపై కేసులు పెట్టేందుకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాలకు నీరు అందించి పంటలను కాపాడమని అడగటమే అన్నదాతలు చేసిన నేరమా అని ప్రశ్నించారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లేమి కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా కొరిశపాడు,నాగులుప్పలపాడు మండలాల రైతులకు సక్రమంగా నీరు అందడం లేదని తెలిపారు. దీంతో మిర్చి, మొక్కజొన్న,పొగాకు రైతులు నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు.కష్టపడి పండించిన పంట కళ్ళముందే బీటలువారిన నేల నీటికోసం నోళ్ళు తెరుస్తుంటే ప్రాజెక్టు అధికారులు కిమ్మనకుండా ఉండటమే కాక రైతులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోకుండా వారిపై వేధింపులకు దిగడం ప్రభుత్వ అహంకార ధోరణికి పరాకాష్ట అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆరుతడి పంటలకు సరిపడా నీటిని అందించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు నోటీసులు పంపుతామని ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసుఅధికారులు తమ తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు.










