Aug 31,2021 06:08

ఈ సంవత్సరం రాష్ట్రప్రభుత్వం, జిల్లా అధికారులు నీరు సమృద్ధిగా ఉంది రెండవ పంటసాగు చేసుకోండి అని 6.5లక్షల ఎకరాలకు అనుమతి ఇచ్చారు. అయినా, రైతులు 1.20లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేశారు. .మిగిలిన అయిదు లక్షల ఎకరాలు నీరు ఉన్నా సాగుచేయకుండా ఖాళీగా ఉంచారు. కొన్ని గ్రామాల రైతులు మా చెరువుకు, మా గ్రామాలకు నీరు విడుదల చేయొద్దు, ,మాకు నీటితీరువా నుండి మినహాయింపు ఇవ్వండంటూ విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సమస్య తీవ్రతకు ఇదొక మచ్చు తునక !
        నెల్లూరు జిల్లా డెల్టా రైతులు ప్రభుత్వానికి విన్నపం !
ఏమిటీ వైపరీత్యం? సాగునీరు వద్దు బాబోరు అనేంతగా ఎందుకు బెంబేలెత్తారు?
ఈ ప్రశ్న అనేక అంశాలను ముందుకు తెస్తుంది.నేటి వ్యవసాయరంగ దుస్థితికి ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాల ముందస్తు ప్రభావం,కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ''ప్రతి ధాన్యంగింజ కూడా కొనుగోలు చేస్తాం,రైతులను ఆదుకుంటాం'' అనే ప్రకటనల డొల్లతనం. నెల్లూరు జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు సాగునీటినిస్తాం.సాగుచేసుకొండని ప్రభుత్వం ప్రకటిస్తే కేవలం 1.20లక్షల ఎకరాలనే సాగు చేసి మిగిలిన భూమినంతా ఖాళీగా పెట్టేశారు.
 

                                                                    ఎందుకని ?

    ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం నాయకుల బృందం దగదర్తి మండలం,అనంతవరం, ఉలవపాళ్ళ ,అల్లూరు మండల కేంద్రం, తలిమంచి, కొడవలూరు మండలం,వెంకన్నపాలెం,నెల్లూరు మండలం, పొట్టిపాలెం గ్రామాలలో రైతులవద్దకు వెళ్ళి ఎందుకు సాగు వదిలివేశారు అని పరిశీలన చేసాము. మధ్ధతుధరలలో 60% మించి లేకపోవడం,తూకం 30%అదనం,డీజిల్‌ రేట్లు పెరగడంతో సాగుచేస్తే తీవ్రమైన నష్టాలు రావడంతో సాగును వదిలివేశామని బదులిచ్చారు.
నెల్లూరు జిల్లాలో సుమారు 12లక్షల ఎకరాలు సాగు అయితే అందులో 9లక్షల ఎకరాలు వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద వరి సాగవుతుంది. భౌగోళికంగా నెల్లూరుకున్న ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రం ఇతర ప్రాంతాలతో పంటల సీజన్‌లో వైవిధ్యం ఉన్నది.దేశమంతా సాగే ఖరీఫ్‌,రబీ సీజన్‌లు నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా ప్రారంభం అవుతాయి.ఖరీఫ్‌ డిశంబరులో ప్రారంభం అవుతుంది,రబీ ఆగష్టులో ప్రారంభం అవుతుంది.నెల్లూరువారి భాషలో తొలికారుపంట, ఎడగారుపంట అని పిలుచుకుంటారు.డిశంబరులో ప్రారంభం అయ్యే తొలిగారు పంట జిల్లా అంతటా నీటిలభ్యతను బట్టి సాగు చేస్తారు,ఎడగారుపంట ప్రభుత్వం విడుదల చేసే నీటిలభ్యతను బట్టి,నీటిని విడుదల చేసినప్పుడే సాగుచేస్తారు.గత చరిత్ర అంతా 2వ పంటకు నీరు కావాలని రైతులు ఆందోళన చేసేవారు,సాగూ చేసేవారు.
ఈ సంవత్సరం రాష్ట్రప్రభుత్వం, జిల్లా అధికారులు నీరు సమృద్ధిగా ఉంది,2వ పంటసాగు చేసుకొండి అని 6.5లక్షల ఎకరాలకు అనుమతి ఇచ్చారు.కాని రైతులు 1.20లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేసారు.మిగిలిన 5లక్షల ఎకరాలు నీరు ఉన్నా సాగుచేయకుండా ఖాళీగా ఉంచారు.కొన్ని గ్రామాల రైతులు మా చెరువుకు,మా గ్రామాలకు నీరు విడుదల చేయవద్దు,మాకు నీటితీరువా నుండి మినహాయింపు ఇవ్వండి అని విజ్ఞాపన పత్రాలు అందించారు.ఇదీ తీవ్రత.
రైతులు తమ స్వీయ అనుభవంతో గత సంవత్సరం 2వ పంటలో వచ్చిన నష్టాలతో ఈ సంవత్సరం పంట సాగుచేయ కుండా ఖాళీగా ఉంచడమే మేలు అని నిర్దారణకు వచ్చారు.గత సంవత్సరం 2వ పంట ఈ 6లక్షల ఎకరాలలోనూ సాగుచేశారు. ఎకరా సాగుకు ఖర్చు రూ.38వేల నుండి 40వేలు అయ్యింది.దిగుబడి మాత్రం 2పుట్లు మాత్రమే అయినాయి. పుట్టి రూ.9వేలు నుండి 10వేలకు మాత్రమే అమ్ముకో గలిగారు.రూ.20వేలు మించి ఆదాయం రాలేదు.ఎకరానికి దాదాపు రూ.20వేలు నష్టపోయిన రైతులు ఇప్పుడు నీరు ఇస్తామన్నా , ప్రభుత్వం సాగుచేయమని కోరుతున్నా సాగుకు నిరాకరించారు. సాధారణంగా 2వ పంట 3పుట్లు పండుతుంది.గత సంవత్సరం అధికవర్షాలు కారణంగా 1.5 నుండి 2 పుట్లు మాత్రమే పండింది.నెల్లూరు జిల్లాలో పుట్టి అంటే 85ంకిలోలు లేదా 11బస్తాలు (75కేజీలచొప్పున) .
గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన మద్ధతుధర పుట్టికి రూ.16048/- .కానీ నెల్లూరు జిల్లాలో రైతుల వద్ద నుండి పుట్టి రూ.9వేల నుండి 10వేల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసారు.తేమ ఎక్కువ ఉందని తూకాన్ని పుట్టికి 850 కేజీల స్థానే 1100కేజీలుగా తీసుకున్నారు.దానితో ధరలో వ్యత్యాసం, తూకంలో వ్యత్యాసం కారణంగా వాస్తవానికి పుట్టికి వీరికి రూ.7650/- మాత్రమే ధర వచ్చింది.దీనితో పాటు అధికవర్షాలుకారణంగా, భూమి తేమగా ఉండడంతో డీజిల్‌రేట్లు పెరగడంవలన సాధారణంగా అయ్యే వరికోత మిషన్‌ ఖర్చు గంటకు ఎకరానికి రూ.2500/-ది గతసంవ త్సరం 7వేల నుండి 8వేలు దాకా అయ్యింది. ప్రతిధాన్యం గింజ కొంటామని ప్రకటించిన మన ముఖ్యమంత్రి మాటలు నెల్లూరు జిల్లాలో నీటిమూటలైనాయి.పుట్టి 850కేజీలు అయితే స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రిగారే 1050కేజీలు జిల్లాలో నిర్ణయించి మిల్లర్‌లకు వంత పాడారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్పినా వాటి ఉనికే లేదు.పండిన ధాన్యాన్ని అమ్ముకోవడం నరకంతో సమానమయ్యింది.ఈ పరిస్థితులను అనుభవించిన రైతులు 2వ పంట సాగుచేసి తట్టుకోగలమనే ధైర్యం లేక సాగును వదిలివేశామని చెప్పారు. పొలాలన్నీ బీడులుగా మారిపో యాయి.మరోవైపున కేంద్రప్రభుత్వం రైతులకోసం అని తెచ్చిన ''వ్యవసాయచట్టాలు'' రైతులకూ ఎందుకూ కొరగాకపోగా మద్ధతుధరను ప్రక్కనబెట్టి కొనుగోలు చేయించడం అనుభవం అయ్యింది.
 

/ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఉపాధ్యక్షులు/
పి నరసింహారావు

పి నరసింహారావు