
ప్రజాశక్తి-అమరావతి : 25 ఏళ్లు ఐఎఎస్ అధికారిగా విశేష అనుభవం, సమర్థత వంటివి పరిగణనలోకి తీసుకునే నీలం సహానిని రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఇసి)గా గవర్నరు నియమించారని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఐదేళ్లుగా వార్షిక నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎస్‌ఇసి నియామకం జరిగిందంటూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనరు వాదనలను ఈ నెల 9న వింటామని ప్రకటించారు.
- ఎంబిబిఎస్ ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణులం కాకపోయిన తమను బ్యాక్‌లాగ్స్‌తో సంబంధం లేకుండా సెకండియర్‌లోకి అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని పలువురు మెడికల్ స్టూడెండ్స్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ వైద్య విద్యార్థుల అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. రెండో ఏడాదిలో మొదటి ఏడాదిలో ఫెయిల్ అయిన సబ్జెక్టులను రాసేందుకు జాతీయ మెడికల్ కమిషన్ నిరాకరించింది.
ఈ చర్యలను హైకోర్టు ఆమోదిస్తూ జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఏడాది ఫెయిల్ అయిన సబ్జెక్టులను రెండో ఏడాదిలో రాసేందుకు జాతీయ మెడికల్ కమిషన్ నిరాకరణ చేయడాన్ని సవాల్ చేసిన మెయిన్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని జాతీయ మెడికల్ కమిషన్ తోసిపుచ్చింది. ఈ చర్యను సవాలు చేస్తూ 114 మంది మెడికల్ స్టూడెంట్స్ దాఖలు చేసిన రిట్ విచారణను వాయిదా వేసింది.
- జయభేరి సంస్థ చైర్మన్ మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. స్థలం తీసుకుని మోసగించారని మురళీమోహన్‌పై భూ యజమాని సిఐడికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి గురువారం జరిపే విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ మురళీమోహన్, కుటుంబ సభ్యులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కె.లలిత విచారణ జరిపారు. అనంతరం సిఐడి కేసులో అన్ని రకాల చర్యలనూ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.