ప్రజాశక్తి-భట్టిప్రోలు: గృహం నిర్మించాలంటే ఇనుము, కంకర, సిమెంట్ కంటే కూడా ప్రధానమైనది నీళ్లు. నీళ్లు లేకపోతే ఎన్ని రకాల మెటీరియల్ ఉన్నప్పటికీ ఉపయోగం ఉండదు. అలాంటి నీటి కొరత భట్టిప్రోలు జగనన్న కాలనీలో నెలకొంది. ఇల్లు కట్టుబడికి ఒక్కో డ్రమ్ము వంద రూపాయలు వెచ్చించి దూర ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రతిరోజూ బేస్మెంట్ పూర్తయ్యేంత వరకు రోజుకు 500 రూపాయల వరకు నీటి కొరకు వేచిస్తున్నామని, గోడలు తడుపుకోవటానికి మరో ఐదు వందలతో నీటిని కొనుగోలు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు వాపోతున్నారు. భట్టిప్రోలులో ఉన్న మూడు లేవుట్‌లలో దాదాపు 1120 మందికి నివేశాన స్థలాలు కేటాయించారు. దీనికి గాను 33 ఎకరాల భూమిని ఎకరా రూ.32 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కానీ ఎలాంటి భూగర్భ జలాలు లేని కాలనీలో లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి సరఫరాను అందించటంలో అధికారులు విఫలం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం జగనన్న కాలనీకి కేటాయించిన రూ.10 లక్షల నిధులతో నీటి సమస్య తీర్చాలని ముందుగా అధికారులు భావించినా ఆ మేరకు ఏ ఒక్కరూ టెండరు వేయటానికి ముందుకు రాకపోవటంతో ఆ నిధులు కాస్తా వెనుదిరిగాయి. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా మండల పరిషత్ నుంచి రూ.5 లక్షలు కేటాయించడంతో వెల్లటూరు ఛానల్ వద్ద బోర్లు ఏర్పాటు చేసి పైపు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఆ ప్రాంతంలో కూడా బోర్లకు నీరు రాకపోవటంతో కేటాయించిన నిధులు మట్టిపాలయ్యాయి. చేసేదేమీ లేక లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గతేడాది గ్రామ పంచాయతీ నుంచి మరో లక్ష కేటాయించి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి నీటి సరఫరా కొరకు పైపులైన్ నిర్మించారు. కానీ మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేయాల్సిన పైపులైను నిర్మాణం పూర్తికాకపోవటంతో పంచాయతీ నిధులు నిరుపయోగమయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్ సకాలంలో పైపులైన్ నిర్మాణం చేపట్టకపోవడం వలన గృహ నిర్మాణానికి నీటిని కొనుగోలు చేసుకోవలసిన అగత్యం ఏర్పడిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఒత్తిడితో ఖంగుతింటున్న దిగువ స్థాయి అధికారులు
గృహ నిర్మాణాలు వేగవంతం చేసి ప్రతి రోజూ ఎన్ని ప్రారంభించారో ప్రగతి చూపించాలని, లేకుంటే సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారులు చేస్తున్న ఒత్తిడితో దిగువ స్థాయి అధికారులు ఖంగుతింటున్నారు. లబ్ధిదారులతో దగ్గర సంబంధాలు ఉన్న ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఎవరికి వారు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తే మా మాట ఎవరు వింటారని కింది స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భట్టిప్రోలులో సుమారు వంద గృహాలకు మించి నిర్మాణ పనులు చేపట్టలేదు. బేస్మెంట్ వేసుకున్నవారికి కూడా సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లులు రాకపోతే అప్పులుచేసి మరీ గృహాలు నిర్మించుకోవటం తమ వల్లకాదని పలువురు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా స్థలాల భూమి లోతట్టు ప్రాంతం కావటం, భూగర్భ జలాలు లేకపోవటంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడంలేదని స్పష్టమవుతోంది. మరో మూడు నెలలు గడిస్తే వర్షాలు ప్రారంభమవుతాయని, అప్పుడు మరలా అర్ధాంతరంగా పనులు నిలిచిపోతాయని, దీని దృష్ట్యా ఉన్నతాధికారులు స్పందించి గృహాలు నిర్మించాలని ఒత్తిడి చెయ్యటం కంటే ముందు అందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తే అప్పో సప్పో చేసుకుని గృహాలు నిర్మించుకుంటామని లబ్ధిదారులు చెపుతున్నారు.










