ప్రజాశక్తి-తెనాలిరూరల్ : వరిపైరు పొట్టదశలో ఉందని, ఈ క్రమంలో పొలాలకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మండలంలోని హాఫ్‌పేట, నంబూరు డొంక, కొలకలూరు గ్రామాల్లో ఎండిపోయిన పొలాలను టిడిపి, జనసేన నాయకులతో కలిసి రాజేంద్రప్రసాద్ శనివారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ బీడుబారి నెర్రులిచ్చిన పొలాలకు సాగునీరు అందించాలని అధికారులకు ఈనెల 11న ఓరామని, అయినా ఇంకా స్పందించలేదని అన్నారు. హై లెవెల్ ఛానల్ ఈస్ట్ పరిధిలో 4 వేలు ఎకరాలు ఉండగా ఆయా పొలాలకు నీరు సకాలంలో అందడం లేదన్నారు. హాఫ్‌పేట, కొలకలూరు, ఖాజీపేట పరిధిలో సుమారు 1000-1500 ఎకరాల్లో పైరు ఎండిపోయిందని, అధికారులు స్పందించి బకింగ్ హాం ఛానల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడెనిమిది వేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తే రైతుల కొష్టాలు కొంతైనా తీరతాయని చెప్పారు. నీటి సమస్య వలన ఎకరాకు రూ.1600 అదనంగా రైతులకు ఖర్చవుతోందని, దీంతోపాటు విద్యుత్ కోతలతో రైతుల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావని అన్నారు. నష్టపోతున్న వారిలో ఎక్కువగా కౌలురైతులేనని, కంకులు రావాల్సిన పొలాల్లో గడ్డిపూలు మొలవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు. మరోవైపు రైతుల సమస్యలు పట్టని వైసిపి నాయకులు పథకాల ప్రచారంలో తనమునకలై ఉన్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే టిడిపి, జనసేన కలిసి రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
మా గోడు ఎవరికీ పట్టడం లేదు
భాస్కరరావు, కౌలు రైతు, హాఫ్‌పేట
అప్పులు చేసి 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. వాన కోసం ఎదురుచూశాం. కనీసం కాల్వలు ద్వారానైనా సాగునీరు అందుతుందని ఆశపడ్డాం. ఏ ఫలితమూ లేదు. మా గోడు ఎవరికీ పట్టడం లేదు. మోర్టార్లు, నీళ్ల ట్యూబులు కోసం రూ.2 వేలు అదనపు ఖర్చవుతోంది. పంట చేతికొచ్చేలా ప్రభుత్వం ఆదుకోవడంతోపాటు.. ఇప్పటికే జరిగిన నష్టానికి పరిహారంగా ఆర్థిక సాయం చేయాలి.
సాగునీరు ఎందుకివ్వడం లేదో సమాధానం చెప్పాలి
ప్రజాశక్తి - చేబ్రోలు : పొలాలకు సాగునీరు అందర రైతులు విలపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డి.నరేంక్రుమార్ విమర్శించారు. మండలంలోని సుద్దపల్లి, శలపాడు గ్రామాల్లో పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఒకపక్క ఇబ్బంది పడుతుంటే మరోవైపు సంక్షేమ పథకాల్లో దోపిడీ ఎలా చేయాలోనని సిఎం ఆలోచిస్తున్నారని అన్నారు. సాగునీరు ఎందుకివ్వడం లేదో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే నీటిపారుదల శాఖ కార్యాల యాలను ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పరిశీలనలో టిడిపి మండల అధ్యక్షులు ఎం.వెంకటరామ రాజు, నాయకులు లక్ష్మినారాయణ, జ్యోతి కుమార్, వెంకటసుబ్బయ్య, బసవ శివశంకర్‌రావు పాల్గొన్నారు.










