May 08,2022 12:40

అసలే చలికాలం కావడంతో సూర్యుడు కూడా మేఘాల దుప్పటి కప్పుకుని, వెచ్చగా పడుకోవడానికి త్వరత్వరగా ఇంటికి చేరుకుంటున్నాడేమో.. ఆరుకాక ముందే చీకటి పడుతోంది ఈ మధ్య. కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పటికే ప్రతిరోజూ ఆరు దాటుతుంది. ఆ రోజు ఇంకా గడియారంలో రెండు ముళ్లు ఎదురెదురు పడకముందే, సన్నగా చీకట్లు మసురుకోవటం మొదలయ్యింది.
ఇంటి గేటు తీసుకుని, లోపలికి అడుగు పెడుతుండగా ఎవరివో మాటలు వరండాలో నుంచి వినపడుతున్నాయి.
'మాస్టర్కి చాలాసార్లు చెప్పాను మేడమ్‌. కానీ వింటేకదా?' అస్పష్టంగా ఏవో కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి.
తుప్పు పట్టి బాగా అరిగిపోయిందేమో, ఇకనైనా నాకు విశ్రాంతినివ్వండి అన్నట్టుగా ఇనుప గేటు పెట్టిన పెద్ద ఆర్తనాదానికి వరండాలోని ఆకారాలు మాటలు ఆపేసి, నా వంకే చూడటం మొదలుపెట్టాయి.
వరండాలోకి అడుగుపెడుతూ కళ్లద్దాలను సరిచేసుకుంటూ వాళ్ల వంక తేరిపార చూశాను. ఎవరో భార్యభర్తలు, బహుశా బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వాళ్లలాగా ఉన్నారు. పక్కనే మా ఆవిడ, నన్ను చూడగానే లేచి నిల్చున్నారు.
వాళ్లు ఎవరో గుర్తు రాకపోవడంతో ఎవరన్నట్లు మా ఆవిడ వంక చూశాను.. ప్రశ్నార్థకాన్ని మొహంమీద ముద్రించుకుంటూ.
మా ఆవిడ నోరు తెరిచేలోపే, 'మాస్టారు నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు లేరు?' అంటూ నా మీదకో ప్రశ్నని వదిలాడు అజ్ఞాతవ్యక్తి.
చేతిలోని బ్యాగ్‌ని మా ఆవిడకు అందించి, అక్కడ ఖాళీగా ఉన్న నాలుగో కుర్చీలో నిదానంగా కూర్చుంటూ.. 'గుర్తుపట్టలేదు బాబు, వయసు మీద పడుతోంది కదా! కూర్చోండి' అన్నాను అనునయంగా నాకంటే చిన్నవాళ్లు కాబట్టి.
'నేను మాస్టారూ! మన కాలేజీలో ఫస్ట్‌బ్యాచ్‌ స్టూడెంట్‌ వెంకటేశ్వర్లుని. మా నాన్నగారు ఆంజనేయులు. నా గురించి చాలాసార్లు కలిశారు మిమ్మల్ని. గుర్తుకు రావటం లేదా..?' గడగడా చెప్పుకుపోతున్నాడు అజ్ఞాతవ్యక్తి.
ఈ లోపు మా ఆవిడ అందరికీ వేడి వేడి కాఫీ చేసి, తీసుకురావడంతో, అతని మాటల వరదకు అడ్డుకట్ట పడింది. కాఫీని చప్పరిస్తూ, అతన్ని గుర్తు చేసుకోవటానికి జ్ఞాపకాల తీరంలో కాసేపు పచార్లు చేయడానికి అవకాశం దొరికింది నాకు.

                                                                                 ***

కాలేజీకి సంబంధించిన ఫైళ్లు చదవటంలో మునిగిపోయిన నేను 'నమస్తే సార్‌' అంటూ నా గదిలోకి ఓ నడి వయసున్న వ్యక్తి ప్రవేశించటంతో.. తల పైకెత్తి అటుగా దృష్టి సారించాను.
ఎదురుగా వున్న ఆకారాన్ని చూస్తే, అతని ఆహార్యం ఓ బక్కచిక్కిన రైతులాగా కనపడుతోంది. దగ్గరకు రమ్మన్నట్టు తలాడించడంతో.. ఆ ఆకారం తిన్నగా నడుచుకుంటూ వచ్చి నా ఎదురుగా చేతులు కట్టుకుని, నిలబడింది.
'కూర్చోండి' అంటూ నా ఎదురుగా ఉన్న కుర్చీని కాస్త ముందుకు జరిపాను. నా గదిలోకి అజ్ఞాత వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ముందు కూర్చోమంటూ కుర్చీ చూపించడం నాకు అలవాటు. కొంతమంది తమ అధికారాన్ని, పదవిని అహంకారాన్ని చూపించుకోవటానికి అన్నట్టు.. తమకోసం వచ్చిన వాళ్లని నిలబెట్టే మాట్లాడుతూ ఉంటారు.
అతడు నా ముందు కూర్చోవడానికి కాస్త సిగ్గుపడుతూ 'పర్లేదు సార్‌!' అంటూ అలాగే నిలబడ్డాడు.
'పర్లేదు ముందు కూర్చోండి! తర్వాత మాట్లాడుకుందాం' అంటూ కుర్చీవైపు చూశాను.
ఇక తప్పదన్నట్టు సిగ్గుపడుతూనే కుర్చీలో ఒక పక్కగా ఒదిగి కూర్చున్నాడు ఆ వ్యక్తి.
'ఇప్పుడు చెప్పండి!' అంటూ చేస్తున్న పని ఆపేసి, అతని వంక చూశాను.
'నా పేరు ఆంజనేయులు సార్‌! మా అబ్బాయి వెంకటేశ్వర్లు అని.. ఇక్కడ రెండో ఏడాది చదువుతున్నాడు. వాడెలా చదువుతున్నాడో కనుక్కొని వెళదామని వచ్చాను సార్‌!' అని బదులిచ్చాడు.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాలేజీలో చేర్పించిన తర్వాత తమ బాధ్యత తీరిపోయిందని, కాలేజీ ఛాయలకు కూడా వెళ్లరు. ఏడాదికి ఒక్కరో ఇద్దరో ఇటువంటి వాళ్లు వచ్చి, వాళ్ల పిల్లల అభివృద్ధి గురించి అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు నాకెంతో సంతోషం వేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు తమ బాధ్యతలు తెలుసుకున్నప్పుడే కదా ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా తమవంతు బాధ్యతలు నిర్వర్తించేది. తల్లిదండ్రులు నెలకు ఒక్కసారైనా వాళ్ల పిల్లలు ఎలా చదువుతున్నారు అని, కాలేజీకి వెళ్లి టీచర్లను వాకబు చేస్తూ ఉంటే, చాలావరకూ పిల్లలు పెడదారి పట్టకుండా, సక్రమమైన మార్గంలో నడవటానికి ఆస్కారం ఉంటుంది.
'మీరు ఏం చేస్తూ ఉంటారు ఆంజనేయులు గారు? మీ వాడి నెంబర్‌ ఏమైనా తెలుసా?' ఉత్సాహంగా ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించాను.
'నాది వ్యవసాయం సారు, ఓ ఎకరం సొంతనేల, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్నాను. ఒక్కడే మగబిడ్డ కావడంతో కాస్తంత కష్టమైనా చదివిస్తున్నాం వాడిని. ఆ నెంబర్‌ ఏదో తెలవదు సార్‌' అంటూ చెప్పుకొచ్చాడు ఆంజనేయులు.
పర్లేదు అన్నట్లు తలూపి, అటెండర్‌ని పిలిచి, ఆ వెంకటేశ్వర్లుని వెతికి తీసుకురమ్మని పురమాయించాను.
పది నిమిషాల తర్వాత వెంకటేశ్వర్లును నా ముందు ప్రవేశపెట్టాడు అటెండర్‌.
వెంకటేశ్వర్లుని చూడగానే వాడి వ్యవహారం మొత్తం ఓ క్షణం నా కళ్లముందు మెదిలింది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి పాతికేళ్ల అనుభవం వల్ల విద్యార్థులను చదవడం బాగా అలవాటయ్యింది.
'వీడేనండి మా అబ్బాయి. ఎలా చదువుతున్నాడు?' అంటూ అడిగాడు ఆంజనేయలు వెంకటేశ్వర్లు వంక చూస్తూ..
ఆంజనేయులు అడగడమైతే అడిగాడు కానీ, అతని ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఆలోచనల్లో మునిగిపోయాను. వెంకటేశ్వర్లు ఉరఫ్‌ వెంకట్‌, ఆంజనేయులు అనుకుంటున్నట్టు పెద్దగా తెలివిగలవాడు ఏమీకాదు. మొదటి సంవత్సరం పరీక్షలలోనే రెండు, మూడు సబ్జెక్లు డింకీ కొట్టినట్టు గుర్తు. పైపెచ్చు కాలేజీలో జరిగే ప్రతి గొడవలో వాడిపేరు వినిపిస్తూ ఉండేది. చాలా సందర్భాల్లో వాడిని సక్రమంగా చదువుకోమని హెచ్చరించటం కూడా జరిగింది. ఇవన్నీ చెబితే పాపం కొడుకు మీద కొండంత ఆశ పెట్టుకున్న ఆంజనేయులు బాధపడతాడని.. 'మీవాడు ఇంకా కష్టపడాలండీ, లేకపోతే ఇబ్బందిపడాల్సి వస్తుంది' అంటూ సున్నితంగా హెచ్చరించాను.
నా అంతరార్థం అర్థమైనవాడిలా.. 'ఏరా వెంకటేశ్వర్లు! సార్‌ గారు చెప్పేది నిజమేనా? నువ్వేదో చదివి ఉద్ధరిస్తే, అమెరికా పంపుదామని మేము అనుకుంటుంటే నువ్వు ఇలా చేయటం ఏమన్నా న్యాయంగా ఉందా?' అంటూ కొడుకును కోప్పడుతూ కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు ఆంజనేయులు.
ఆంజనేయులు మాటలు ఒక్కక్షణం అర్థం కాకపోయినా తర్వాత తేరుకుని.. 'అదేమిటండీ ఇప్పుడే కదా ఒక ఎకరం మాత్రమే సొంత పొలం ఉందని చెప్పారు. మరి వీడిని అమెరికా ఎలా పంపిస్తారు?' అంటూ సందేహం వెలిబుచ్చాను.
'ఏముంది సారూ.. ఉన్న ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో పంపిస్తాను' అంటూ ముందే నిర్ణయించుకున్నవాడిలా స్థిరంగా జవాబు చెప్పాడు ఆంజనేయులు.
'ఉన్న ఒక ఎకరం అమ్మేస్తే మరి మీ పరిస్థితి ఏమిటి?' అంటూ మరో సందేహాన్ని బయటపెట్టాను.
'మాది ఏముంది సార్‌? ఓ రెండు ఎకరాలు కౌలుకు చేస్తాను. అదీ కుదరకపోతే ఎక్కడన్నా కూలికి వెళ్తాను. వీడు అమెరికా వెళ్లటం ముఖ్యం సార్‌. వీడు అమెరికా వెళితే ఇట్లాంటి ఎకరాలు ఎన్నయినా సంపాదించొచ్చు సార్‌!' అంటూ నా సందేహాన్ని అమెరికా పట్ల తనకున్న పరిజ్ఞానంతో పటాపంచలు చేశాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత ఆంజనేయులు తరచుగా, వెంకటేశ్వర్లు చదువు గురించి నన్ను కలుస్తూనే ఉన్నాడు. ఆంజనేయులు పడుతున్న కష్టంచూసి, జాలివేసి నేను కూడా అడపాదడపా వెంకటేశ్వర్లుని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించే వాడిని.
మొత్తంమీద వెంకటేశ్వర్లు అత్తెసరు మార్కులతో సెకండ్‌ క్లాసులో డిగ్రీ చదువు పూర్తిచేశాడు. చదువు పూర్తయిన తరువాత మళ్లీ నాకు వెంకటేశ్వర్లుగానీ అతని తండ్రి ఆంజనేయులు గానీ కనబడలేదు. ఆంజనేయులు కోరుకున్నట్టు వెంకటేశ్వర్లు అమెరికా విమానం ఎక్కాడో లేదో కూడా తెలియదు.
ఇలాంటి అనుభవాలు నాకే కాదు ప్రతి ఉపాధ్యాయుడికి కొత్తేమీ కాదు. ఎంతోమంది విద్యార్థులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కళాశాలలో ఉన్నంతవరకూ వారి చదువు సంధ్యల గురించి, బాగోగుల గురించి పట్టించుకోవడం తప్ప, వాళ్లు కళాశాల నుండి బయటికి వెళ్లిపోయిన తర్వాత తమని గుర్తుపెట్టుకోవాలని ఏనాడు ఏ ఉపాధ్యాయుడూ ఆశించడు.

                                                                               ***

నాలుగేళ్ల తర్వాత అనుకుంటాను అమెరికా నుంచి ఒకసారి ఫోన్‌ వచ్చింది.
'ఏవండోరు ఎవరో వర్లు అట, అమెరికా నుంచి మీకే ఫోను' పెద్దగా అరుస్తూ చెప్పింది మా ఆవిడ.
ఆ అరుపు మాకూ అమెరికా నుంచి ఫోన్‌ చేసే వాళ్లున్నారన్నట్లు, అది చుట్టుపక్కల వాళ్లందరికీ వినపడాలన్నట్లు వుంది. ఆవిడ అల్ప సంతోషానికి జాలిపడుతూ, అమెరికా నుంచి నాకు ఫోన్‌ చేసేది ఎవరబ్బా అనుకుంటూ, మా ఆవిడ చేతిలోని ఫోన్‌ అందుకున్నాను.
ఫోన్‌ చేసింది మరెవరో కాదు వెంకటేశ్వర్లే. అమెరికా వెళ్లిన తర్వాత తన పేరు వెంకటేశ్వర్లు మోటుగా ఉందని వి.వర్లుగా మార్చుకున్నాడట! అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం దొరికిందని, రెండు చేతులా సంపాదిస్తున్నాడనేది ఆ ఫోన్‌ తాలూకు సంభాషణల సారాంశం. అటు తర్వాత.. అడపాదడపా వెంకటేశ్వర్లు ఫోన్‌ చేస్తూ ఉండేవాడు. మాటల మధ్యలో నన్ను కూడా అమెరికా రమ్మని ఆహ్వానించేవాడు. నాలాంటి ప్రతిభ గల వారికి అమెరికాలో పెద్ద పెద్ద జీతాలు ఇస్తారని ఆశ పెట్టేవాడు.
ఒకసారి మా ఆవిడ కూడా 'ఆ కుర్రాడు అంతగా ప్రాధేయపడుతుంటే మీరూ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చుగా?!' అంటూ నన్ను ఒత్తిడి చేయాలని చూసింది.
'రహదారి పక్కన బాటసారులు కాస్తంత విశ్రాంతి తీసుకోవడానికి అన్నట్లు పెద్ద పెద్ద నీడనిచ్చే చెట్లను నాటుతూ ఉంటారు. ఆ చెట్లకింద ఎంతోమంది బాటసారులు విశ్రాంతి తీసుకుని, సేద తీరిన తర్వాత తమ గమ్యం వైపు సాగిపోతూ వుంటారు. తన నీడలో సేదతీరే బాటసారుల గురించి ఏనాడూ ఆ చెట్టు ఆరా తీయదు. అలాగే ఆ బాటసారులతో పాటు తనూ ముందుకు సాగిపోవాలని ఏనాడూ కోరుకున్నది లేదు. ఉపాధ్యాయుడూ అంతే తన వలన ఉన్నతస్థాయికి చేరిన విద్యార్థులను చూసి ఆనంద పడతాడు తప్ప, వాళ్ల స్థాయికి ఎదగాలని ఏనాడూ కోరుకోడు' అంటూ చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చాను.
నా ఆంతర్యం అర్థమైన మా ఆవిడ మళ్లీ ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాలేదు.
కొన్నాళ్ల తర్వాత వెంకటేశ్వర్లు నుండి ఫోన్‌ రావడం ఆగిపోయింది. నేను కూడా నా పనులతో తీరిక లేకుండా ఉండటం వల్ల వెంకటేశ్వర్లు జ్ఞాపకాలను మనసు అరల్లో ఒక మూలకు తోసేశాను.
మళ్లీ ఇన్నాళ్లకు వెంకటేశ్వర్లు నా ముందు ప్రత్యక్షమవ్వటంతో.. మెదడు పొరల్లో దాక్కున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
'ఏమోరు వర్లు బాగున్నావా? పెళ్లి కూడా అయినట్టుంది' అంటూ పలకరించాను.
ఆ పిలుపుకు కాస్త సిగ్గు పడుతూ 'అవును మాస్టారు' అంటూ జవాబిస్తూ తలదించుకున్నాడు.
'మరి మమ్మల్ని పెళ్లికి పిలవలేదే?' ఆతృతతో అమాయకంగా ప్రశ్నించింది మా ఆవిడ.
దానికి సమాధానంగా వెంకటేశ్వర్లు భార్య 'ఇద్దరం అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నామండీ. మా పేరెంట్స్‌ కూడా మా పెళ్లికి రాలేదు. అందుకనే ఎవర్నీ పిలవలేకపోయాము' అంటూ తేల్చి చెప్పేసింది.
కథ మొత్తం అర్థమైనదానిలా మళ్లీ నోరు మెదపలేదు మా ఆవిడ.
ఈ రోజుల్లో స్నేహాలైనా, వివాహాలైనా అవసరాల కోసం తప్ప.. ఆత్మీయతలు, అనురాగాల కోసం మాత్రం కాదు. కొడుకు అమెరికా వెళ్లి పెద్ద ఉద్యోగం చేయాలని కలలుగన్న ఆంజనేయులు.. తన కొడుకు పెళ్లి కళ్లారా చూడలేకపోయాడని లోలోపలే బాధపడుతూ, 'ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారూ?' అంటూ ప్రశ్నించాను.
దానికి సమాధానంగా వెంకటేశ్వర్లు భార్యే 'మావయ్య గారు కాలంచేసి ఏడాది కావస్తోంది అండి!' అంటూ జవాబిచ్చింది.
'నాన్నగారు మరణించినప్పుడు వీసా దొరకలేదు మాస్టారు. అందుకనే మాకూ రావడానికి కుదరలేదు' భార్యకు వంతపాడాడు వెంకటేశ్వర్లు ఉరఫ్‌ వి.వర్లు.
ఆ సమాధానం వినటంతో అప్పటిదాకా లోలోపల దోబూచులాడిన నా గుండెల్లోని బాధ బయటకు కన్నీటి రూపంలో ఎగతన్నుకుంటూ వచ్చింది.
కొడుకు ప్రయోజకుడై కోట్లు సంపాదిస్తాడని కలలుగన్న ఆంజనేయులు చివరకు అనాధ శవంలా కాటికి చేరిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రుల అవసరం తీరిపోవటంతో కనీసం వాళ్లను కడసారి చూడటానికీ ఏవో వంకలు చెప్పి, తప్పుకు తిరుగుతున్న ఈ మనుషుల్ని ఏమనాలి.
తమ జీవితాలకు నీడనిచ్చిన చెట్లు నేల రాలిపోతుంటే కనీసం వాటిని కాల్చడానికీ తీరికలేని ఈ తరాన్ని చూస్తుంటే ఏమనాలో మాటలు కూడా రాక మౌనంగా ఉండిపోయాను.
నా మౌనంలోని అంతరార్థం అర్థమైందో ఏమో, 'వెళ్లొస్తాం మాస్టారు' అంటూ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి లేచారు.
'కూర్చోండి బాబు వచ్చి అరగంట కూడా కాలేదు, భోజనం చేసి వెళ్దురుగాని' అంటూ మా ఆవిడ వాళ్ల కాళ్లకి అడ్డం పడింది.
మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మా ఆవిడ చేతి వంట రుచి చూడకుండా ఒక పట్టాన వెళ్లనివ్వదు.
'రేపే మేం మళ్లీ అమెరికా వెళ్లిపోతున్నాము. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి మా ఫ్లైట్‌. ఇంకా చాలా పనులు మిగిలే ఉన్నాయి' అంటూ వెంకటేశ్వర్లు భార్యే ముందుకు అడుగులు వేసింది.
'మీతోపాటు మీ అమ్మగారిని కూడా తీసుకెళ్తున్నావా వెంకటేశ్వర్లు?' అడగకూడదని అనుకుంటూనే ఉండబట్టలేక అడిగేశాను.
'అదెలా కుదురుతుందండీ? ఇప్పటికిప్పుడు వీసాలు, పాస్‌పోర్టులు అంటే సాధ్యపడదు కదా?' అంటూ సాగదీసింది వెంకటేశ్వర్లు భార్య.
'మరి ఆవిడని ఏమి చేద్దాం అనుకుంటున్నారు?' మా ఆవిడా ఉండబట్టలేక అడిగింది.
'అదే మాస్టారు, మీకు ఏదైనా తెలిసిన వృద్ధాశ్రమం ఉంటే, అందులో మా అమ్మని చేరుద్దామని' అంటూ నసిగాడు వెంకటేశ్వర్లు.
అప్పటికిగానీ వెంకటేశ్వర్లు నా దగ్గరికి ఏ పనిమీద వచ్చాడో బోధపడలేదు.
వెంకటేశ్వర్లు తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత ఒక్క క్షణం అతని మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటికప్పుడు ఇంట్లో నుంచి బయటికి పొమ్మందామని అనుకున్నాను. కానీ అంతలోనే నన్ను నేను తమాయించుకొని, వృద్ధాశ్రమం గురించి ఆలోచనలలో పడ్డాను.
'నెల నెల తప్పకుండా డబ్బులు పంపిస్తాము మాస్టారు' అంటూ వెంకటేశ్వర్లుకు వత్తాసు పలికింది వాడి భార్య.
ఎగసిపడుతున్న కోపాన్ని దిగమింగుకుంటూనే, నాకు తెలిసిన వృద్ధాశ్రమం అడ్రసు, ఫోన్‌ నెంబరు వాళ్లకు రాసిచ్చాను.
వాళ్లు వచ్చిన పని అయిపోయినట్టు సంతోషంగా 'వెళ్లొస్తాం మాస్టారు, అప్పుడప్పుడు మా అమ్మని కాస్త చూస్తూ ఉండండి' అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడినుంచి నిష్క్రమించారు.
వాళ్లు వెళ్తున్న వైపే చూస్తూ నిలబడిపోయాను నేను. నా దగ్గరగా వచ్చిన మా ఆవిడ 'ఏమిటండీ వీళ్ల వాలకం మరి ఇంత స్వార్థమా? కన్నతల్లి కూడా వీళ్లకు బరువు అయ్యిందా? కలికాలం కాకపోతేనూ' అంటూ నిష్టూరాలు ఆడింది.
'కొన్ని చెట్లు ఎందుకు పెరుగుతాయో ఎవరికీ తెలియదు. ఎవరికీ నీడను ఇవ్వవు. ప్రస్తుత సమాజంలో వీళ్లలాంటి నీడనివ్వని చెట్లే ఎక్కువ' అంటూ మా ఆవిడ సమాధానం కోసం ఎదురు చూడకుండా నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను.

ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985