నీడ లేదు.. నీళ్లు లేవు..
- ఎండలకు పని చేయలేకపోతున్నాం.. పనిముట్లు ఇవ్వడం లేదు..
- వ్యకాస నేతలతో ఉపాధి కూలీలు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
'ఎండలకు పని చేయలేకపోతున్నాం. ఉదయం 8 గంటలకే తీవ్రమైన ఎండలు ఉంటున్నాయి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకుందామన్న నీడ లేదు. చెట్లు లేవు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కనీసం నీడ వసతి లేదు. తాగునీరు కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నాం. పనిముట్లు కూడా ఇవ్వడం లేదు. మేమే సొంతంగా ఇంటి వద్ద నుంచి పనిముట్లు తెచ్చుకుని పని చేస్తున్నాం. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ లాంటివి ఇస్తే బాగుంటుంది. పనుల వద్ద ఒక టెంటు వేస్తే నీడలో సేద తీరవచ్చు' అంటూ ఉపాధి కూలీలు ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి బృందంతో తమ సమస్యలను విన్నవించారు. మంగళవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల తీరును, కూలీలను ఇబ్బందులను ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టి.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ల ప్రతినిది బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించడం వల్ల కూలీలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కూలీలు ఫొటో యాప్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం పనిచేసే చోట టెంటు సౌకర్యం, మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు, ఇతర బీమా సౌకర్యం లేకపోవడం అన్యాయమన్నారు. ఈ సౌకర్యాలు లేకపోవడంతో పాటు తీవ్రమైన ఎండలు ఉండడంతో కూలీలు వడదెబ్బ తగిలి మరణిస్తున్నారని చెప్పారు. వారికి బీమా సౌకర్యం కూడా ఇవ్వడం లేదన్నారు.తక్షణమే అధికారులు ఈ సమస్యలను గుర్తించి పైఅధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో ఉపాధి కూలీలతో మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హుస్సేన్ వలి, యూసుఫ్, రమణమ్మ, హజరత్, కూలీలు పాల్గొన్నారు.










